భాగ్యనగరంలో మరో భారీ అగ్నిప్రమాదం.. వ్యక్తి సజీవదహనం
బొగ్గులకుంట మెకానిక్ షెడ్ లో మంటలు చెలరేగడంతో కారులో నిద్రపోతున్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. మృతుడు సెక్యూరిటీ గార్డ్..
హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ.. అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కింగ్ కోఠిలో ఓ అగ్నిప్రమాదం జరిగింది. బొగ్గులకుంట మెకానిక్ షెడ్ లో మంటలు చెలరేగడంతో కారులో నిద్రపోతున్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. మృతుడు సెక్యూరిటీ గార్డ్ సంతోష్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుకార్లు దగ్ధమయ్యాయి.
అగ్నిప్రమాద సమయంలో భారీ శబ్దాలతో పేలుళ్లు, దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణమేంటన్నది తెలియాల్సి ఉంది. ఘటనలో మరణించిన సెక్యూరిటీ గార్డ్ సంతోష్ కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు చివరిచూపుకి కూడా నోచుకోలేకపోయామంటూ.. గుండెలవిసేలా ఆ తల్లిదండ్రులు రోధించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.