అటు నుంచి వస్తే భారీ ఫైన్
హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. భారీ జరిమానాను విధించనున్నారు
హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తే పన్నెండు వందల రూపాయలు, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తే పదిహేడు వందల రూపాయలు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సక్రమంగా వాహనాలు వెళ్లేలా సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
స్టాప్ లైన్ ను దాటితే....
ఏదైనా స్టాప్ లైన్ ను దాటితే వంద రూపాయలు, ఫ్రీ లెఫ్ట్ ను బ్లాక్ చేస్తే వెయ్యి రూపాయలు, నో పార్కింగ్ లో వాహనాలను నిలిపితే ఆరు వందల రూపాయల జరిమానా విధించననున్నారు. ఫుట్ పాత్ లను అతిక్రమిస్తే భారీగా జరిమానా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నిఘా కెమెరాలకు చిక్కినా జరిమానాలు తప్పవని చెబుతున్నారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను సక్రమంగా పాటించాలని పోలీసులు కోరుతున్నారు.