హైదరాబాద్ లో "Q" ఫీవర్.. 250 శాంపిల్స్ ను పరీక్షించిన వైద్యులు
వ్యాధి సోకిన జంతువు ద్వారా కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా ప్రజలు వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి.
కరోనా మహమ్మారి బెడద పూర్తిగా పోకుండానే.. సీజనల్ వ్యాధులు మేము కూడా ఉన్నాం అన్నట్టుగా చుట్టుముడుతున్నాయి. హైదరాబాద్ లో కొత్తరకం ఫీవర్ వ్యాపిస్తోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. క్యూ ఫీవర్ గా పిలిచే ఈ వ్యాధి ఇప్పటికే పలువురిలో బయటపడిందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్, ఎన్‌ఆర్‌సిఎం సెరోలాజికల్ ఈ మేరకు పలు టెస్టులు నిర్వహించింది. 250 మంది మాంసం విక్రేతలశాంపిల్స్ ను పరీక్షించగా.. ఐదుగురు విక్రేతలకు క్యూ జ్వరం ఉన్నట్లు నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో.. ప్రజలు కబేళాలకు దూరంగా ఉండాలని సూచించారు.
క్యూ ఫీవర్ తో బాధపడుతున్న వ్యక్తులలో జ్వరం, చలి, అలసట, కండరాల నొప్పితో పాటు ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెప్పారు. Psittacosis, హెపటైటిస్ E వంటి అనేక ఇతర జూనోటిక్ వ్యాధులు కూడా 5% కంటే తక్కువ నమూనాలలో గుర్తించినట్టుగా NRCM ధృవీకరించింది. sittacosis అనేది ఒక అంటు వ్యాధి. ఇది సాధారణంగా పక్షి జాతికి చెందినది. వ్యాధి సోకిన పక్షుల నుండి మానవులకు వ్యాపిస్తుంది.
Q జ్వరం అనేది మేకలు, గొర్రెలు, పశువుల వంటి జంతువుల నుండి వ్యాపించే కోక్సియెల్లా బర్నెటి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియా సంక్రమణం. వ్యాధి సోకిన జంతువు ద్వారా కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా ప్రజలు వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి. క్యూ జ్వరంపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు అతి కొద్దిమందికి మాత్రమే ఈ వ్యాధి సోకిందని.. దీని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పశువుల కాపరుల నుండి వ్యాధి సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో.. మాస్కులను తప్పనిసరిగా వాడాలని సూచించారు.