హైదరాబాద్ లో 9న జీరో షాడో డే.. మాయం కానున్న నీడ
అదే సమయంలో మనుషులు ఎండలో నిలబడినా నీడ కనిపించదని పేర్కొన్నారు. ఆగస్టు 3న కూడా భాగ్యనగరంలో జీరో షాడో డే..
మే 9వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ లో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా మధ్యాహ్నం 12.12 గంటలకు నగరంలో నీడ మాయం కానుంది. అంటే మన నీడ కనిపించదు. ఆ రోజున నగరంలో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుంది. దాన్నే జీరో షాడో డే అంటారు. ఎండలో నిటారుగా (90 డిగ్రీల కోణం) ఉంచిన వస్తువుల నీడ రెండు నిమిషాల పాటు అంటే 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు కనిపించదని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారులు తెలిపారు.
అదే సమయంలో మనుషులు ఎండలో నిలబడినా నీడ కనిపించదని పేర్కొన్నారు. ఆగస్టు 3న కూడా భాగ్యనగరంలో జీరో షాడో డే ని చూడవచ్చని తెలిపారు. సమయంలో మార్పుల వల్ల దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ జీరో షాడో డే వస్తుందన్నారు. కాగా, ఇటీవల అంటే ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12.17 గంటలకు బెంగళూరులో ఎండలో ఉంచిన వస్తువులు, మనుషుల నీడ మాయమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ అద్భుతాన్ని ఎవరూ మిస్ కావొద్దని చెప్పారు.