Union Budget : బడ్జెట్‌లో ఉండే రాయితీలు ఇవేనటగా.. వారికే వరాల వర్తింపు
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు సభలోబడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. తాత్కాలిక బడ్జెట్ ను నిర్మలమ్మ ప్రవేశ పెట్టనుంది. అయితే ఎన్నికలు ఉండటంతో అనేక తాయిలాలు ఉండే అవకాశముంది. కొన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్న దానిపై అనేక రకాలుగా చర్చ జరుగుతుంది.
కొన్ని రాయితీలను...
దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్యమైన విషయాల్లో ప్రభుత్వం రాయితీలు ప్రకటించే అవకాశముందని సమాచారం. అదే సమయంలో ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు ఉండకపోవచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచిన కేంద్ర ప్రభుత్వం మరొకసారి పెంచే అవకాశాలు లేవన్నది అధికార వర్గాలు చెబుతున్న విషయం. రైతులను ఆకట్టుకునే విధంగా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచడం, పెట్రోలు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, విద్యుత్ వాహనాలకు రాయితీలు ఇవ్వడం వంటివి ఉంటాయనన అంచనాలు వినిపిస్తున్నాయి.
ఉదయం 11 గంటలకు...
ఈరోజు ఉదయం 11 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకుఆమె ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అధికారులతో కలసి రాష్ట్రపతి భవన్ కు వెళతారు. రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ ను సమర్పించడానికి అనుమతి కోరనున్నారు. అనంతరం ఉదయం పది గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారని, 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ లోక్ సభలో నేడు ఆమోదం పొందనుంది. మరి సీతారామన్ బడ్జెట్ లో ఎలాంటి అంశాలు ఉంటాయన్నది చూడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.