విడాకుల గుడి.. ఎక్కడ ఉంది ? ఆ పేరెందుకొచ్చిందో తెలుసా ?
స్త్రీలకు వివాహమయ్యాక ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. విడాకులు అడిగే స్వేచ్ఛ, స్వతంత్రం అప్పట్లో ఉండేవి కాదు.
సాధారణంగా.. మన దేశంలోనైనా, విదేశాల్లో అయినా గుడి లేదా ఆలయం అంటే దేవుళ్లను చూస్తాం. మనసులో ఉన్న కోరికలను తీర్చమని వేడుకునేందుకు, మొక్కిన మొక్కులను తీర్చుకునేందుకు ఆలయాలకు వెళ్తుంటాం. కానీ.. విడాకుల గుడి అని పిలువబడే ఓ ఆలయం ఉందని చాలా మందికి తెలీదు. మీరు చదివేది నిజమే. ఈ గుడిని విడాకుల గుడి అని పిలుస్తారు. 600 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మాస్తుగావోకా టోకీజీ ఆలయం జపాన్ లో పేరొందింది. ఈ ఆలయాన్నే విడాకుల గుడి లేదా డైవర్స్ టెంపుల్ గా పిలుస్తారు.
12,13 శతబ్దాలలో జపనీస్ సమాజంలో విడాకుల భావన గుర్తింపుపొందింది. అయితే ఈ స్వతంత్రం పురుషులకు మాత్రమే ఉండేది. స్త్రీలకు వివాహమయ్యాక ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. విడాకులు అడిగే స్వేచ్ఛ, స్వతంత్రం అప్పట్లో ఉండేవి కాదు. మహిళలపై సామాజిక కట్టుబాట్లు ఉండేవి. భర్త విడాకులు ఇచ్చిన స్త్రీలు.. నిస్సహాయులుగా ఉండేవారు. అలాంటి వారికి 1285లో బౌద్ధ బిక్షువు కాకుసాన్ షిదో-నీ నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రంగా మారింది. మరణించిన తన భర్త హోజో టోకిమునే జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని నిర్మించారామె. బౌద్ధమందిరంగా విలసిల్లుతోన్న ఈ ఆలయంలో పెళ్లై.. విడాకులైన ఒంటరి మహిళలు ఇక్కడే వచ్చి ఆశ్రయం పొందేవారు. అంతేకాదు. వివాహం పేరుతో చిత్రవధకు గురైన వారికీ ఆశ్రయమిచ్చేవారు.
సామాజిక వర్గాల్లో పెటాకులైన పెళ్లి జంటలకు విడాకుల వ్యవహారాలు విరివిగా జరిగేవి. అలాంటి మహిళలకు ఇక్కడ విడాకుల ధృవపత్రాలను అందించేవారు. ఈ ధృవపత్రాలు ఒంటరి మహిళలకు స్వేచ్ఛగా జీవించే హక్కును ఇచ్చేవి. 1873లో జపాన్ మహిళలు విడాకులు తీసుకోవడానికి వీలు కల్పించే చట్టాలను ప్రవేశపెట్టే వరకు ఈ ఆలయం విడాకులు కోరుకునే మహిళలకు ఆశ్రయం కల్పించింది. నేడు, ఇది మహిళల విడాకుల హక్కును చట్టబద్ధం చేయడానికి జపాన్ సమాజంలో చేసిన పురోగతికి శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని డైవర్స్ టెంపుల్ గా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే యాత్రికులు తమ విడాకుల కారణాలను ఒక పేపర్ పై రాసి ఆలయంలోని టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేస్తారు.
ఈ ఆలయంలో ఉన్న ఓ సంగ్రహాలయంలో.. ఆలయ చరిత్రతో ముడిపడి ఉన్న కళాకృతులు కనిపిస్తాయి. నాటి మహిళల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపే ఆనవాళ్లు కూడా ఉన్నాయి. బౌద్ధమతానికి సంబంధించిన ధార్మిక సమావేశాలు ఇక్కడ జరిగేవి. ఇప్పటికీ ఆలయంలోని బౌద్ధ భిక్షువులు, నన్ లు ఈ ఆలయానికి వచ్చేవారికి మార్గదర్శనం చేస్తుంటారు. ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రశాంతతనిస్తుందని చెబుతారు.