KCR : అధికారం కోల్పోయిన తర్వాతనే అసలు రంగు బయటపడింది.. వీళ్లకా పదవులు ఇచ్చింది?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు వీళ్లనా తాను నమ్మింది? అని ముఖ్య సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇంత మంది తనను మోసం చేసి వెళ్లిపోతారని కలలో కూడా ఊహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉండగా అనేక సమీకరణాలను చూసి వారికి పదవులను కేసీఆర్ కట్టబెట్టారు. కొందరికి రెండు సార్లు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మరికొందరికి ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చి మరీ రాజకీయ హోదాను కల్పించారు. అయితే వారే బీఆర్ఎస్ ఓటమి తర్వాత వెళ్లిపోతుండటం కలవరపరస్తుంది.
అవకాశమిచ్చినా....
దానం నాగేందర్ కు రెండు సార్లు ఖైరతాబాద్ టిక్కెట్ ఇచ్చారు. ఆయన కారణంగా ఉద్యమం నుంచి తమ పార్టీతో పయనిస్తున్న దాసోజు శ్రావణ్ లాంటి వారిని కూడా పక్కన పెట్టారు. అలాగే ఇంద్రకిరణ్ రెడ్డి లాంటి నేతలకు తొలి దఫాలో బీఎస్పీ నుంచి నెగ్గినా తాను మంత్రివర్గంలో చోటు కల్పించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయనకు కేబినెట్ లో చోటు కల్పించారు. అలాగే 2019 ఎన్నికల్లో రంజిత్ రెడ్డికి తాను టిక్కెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నప్పటికీ ఆయన చివరకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవడం కేసీఆర్ ను కలచి వేస్తుందంటున్నారు. తాను తిరిగి పోటీ చేయాలని కోరినా రంజిత్ రెడ్డి పోటీ చేయనని చెప్పి మరీ కాంగ్రెస్ లోకి వెళ్లి పోటీ చేస్తుండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
పట్నం ఫ్యామిలీకి...
అలాగే ఎమ్మెల్యే పట్నం మహీందర్ రెడ్డి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా, తొలి దఫా మంత్రివర్గంలో చోటు కల్పించామని, రెండోసారి ఆయన ఓటమి పాలయినా ఎమ్మెల్సీగా ఇచ్చి చివరిలో మంత్రివర్గంలో స్థానం కల్పించానన్న విషయాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆయన సోదరుడికి కొడంగల్ స్థానంలో రెండు సార్లు పోటీకి అవకాశం ఇచ్చి తాను తప్పు చేశానని మధనపడుతున్నాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కోనేరు కోనప్ప కూడా తనను మోసం చేసి పార్టీ వీడి వెళతాడని ఊహించలేదని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. పదవులు ఇవ్వని వాళ్లు సరే.. ఇచ్చిన వాళ్లు కూడా వెళ్లిపోవడమేంటన్నది ఆయనకు మింగుడుపడటం లేదు.
కేశవరావు కుటుంబానికి...
తాజాగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలు కేసీఆర్ ను కలవరపరుస్తున్నాయి. ఆమె తండ్రి కేశవరావుకు రెండుసార్లు రాజ్యసభ ఇవ్వడమే కాకుండా ఆమెకు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా అవకాశం కల్పించారు కేసీఆర్. అలాంటి కుటుంబం కూడా తాను సమస్యల్లో ఉన్నప్పుడు వీడి వెళ్లడంపై కేసీఆర్ కు ఎవరిని నమ్మాలి? అన్నది కూడా అర్థం కాకుండా ఉందంటున్నారు. ద్వితీయ శ్రేణి నేతలే నయమని, వారికి పదవులు దక్కకపోయినా.. తనను, తన పార్టీని నమ్ముకుని ఉంటూ తనకు కష్టకాలంలో అండగా ఉంటున్నారని కూడా ఆయన అంటున్నారని తెలిసింది. మొత్తం మీద కేసీఆర్ కు ఎవరు తనవారో.. పరాయి వారో ఇప్పుడు తెలిసి వచ్చిందని పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు.