ఎక్కడ పుట్టినా.....
వాజ్ పేయి మరణించారు. అద్వానీ వృద్ధాప్యంలో ఉన్నారు. ఇద్దరూ ఎందరో రాజకీయనేతలకు ఆదర్శంగా నిలుస్తారు. తమ కోసం, తమ కుటుంబం కోసం కాకుండా దేశం కోసం, పార్టీ కోసం శ్రమించిన నేతలు ఇద్దరూ. వారి స్నేహం మాదిరిగానే పార్టీలోనూ వారి పదవుల విషయంలో ఏ మాత్రం పొరపచ్చాలు తొంగిచూడలేదు. వాజ్ పేయి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించారు. రాజకీయంగా ఉత్తరప్రదేశ్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అద్వానీ వాస్తవానికి ఇప్పటి పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన వారు. దేశ విభజన సమయంలో భారత్ కు వచ్చారు. గుజరాత్ ను తన రాజకీయ కార్యక్షేత్రంగా మలచుకున్నారు. ఇద్దరి దారులు వేరు కావచ్చు. కానీ గమ్యం ఒక్కటే. ఇద్దరి విధానాలు వేర్వేరు కావచ్చు. కానీ లక్ష్యం ఒక్కటే.
సంఘ్ నుంచి...
ఆర్ఎస్ఎస్, భారతీయ జన్ సంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీల్లో ఇద్దరూ కలసి పనిచేశారు. వీటిల్లో కొన్ని పార్టీలకు సారథ్య బాధ్యతలను నిర్వహించారు. వాటిని బలోపేతం చేయడానికి అవిశ్రాంతగా శ్రమించారు. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అయిదో దశకంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నుంచి 2004 లోక్ సభ ఎన్నికల వరకూ ఇద్దరూ కలసి పనిచేశారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నా హోదాలకు అతీతంగా వ్యవహరించారు. వాజ్ పేయి కవితలను అద్వానీ శ్రద్థగా వినేవారు. కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు. హవాలా కుంభకోణంలో అద్వానీ పేరు వెలుగులోకి వచ్చినప్పుడు అటల్ జీ హతాశులయ్యారు. వెంటనే తేరుకుని అండగా నిలబడ్డారు. అద్వానీ కూడా అటల్ పట్ల అమితమైన గౌరవ ప్రతిపత్తులను చూపేవారు. ఆయన తన నాయకుడినని అంగీకరించేందుకు వెనుకాడే వారు కాదు. అటల్, అద్వానీల మధ్య అభిప్రాయ బేధాలు లేకపోలేదు. భిన్న భావాలకు ప్రతీకగా ఉండేవారు కాబట్టే విభేదాలు సహజం. సమస్యలు, సంఘటనలపై భిన్నాభిప్రాయాలు ఉండేవి.
అందరూ అనుసరిస్తే....
అటల్ బిహారీ వాజ్ పేయి అస్తమయం అందరికన్నా ఎక్కువ నష్టం లాల్ కృష్ణ అద్వానీకే. ఆరుదశాబ్దాల అనుబంధం గల సహచరుడిని కోల్పోవడం సాధారణమైన విషయం కాదు. బంధాలు, అనుబంధాలు, జ్ఞాపకాలు, అనుభవాలు, అభిప్రాయాలను ఒక్కసారిగా మార్చిపోవడం కష్టమైన విషయమే. ఎనిమిది పదుల వయసులోనూ జీవిత చరమాంకంలో ఉన్న అద్వానీని ఎప్పుడూ అటల్ జీ జ్ఞాపకాలు వెన్నాడుతుంటాయి. అయిదో దశకంలో ఇద్దరూ కలసి ఢిల్లీలో సినిమా చూసిన రోజులు, సంఘ్ పరివార్ ను పటిష్ట పర్చడానికి పడిన శ్రమ, అత్యవవసర పరిస్థితికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు, బీజేపీని బలమైన జాతీయ పార్టీగా తీర్చిదిద్దడంలో చూపిన శ్రద్థ, విలువల పరిరక్షణకు చేసిన కృషి గుర్తుకు రావచ్చు. ఈరోజు వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అద్వానీ తన నివాసంలోనే గుర్తుకు తెచ్చుకుని గత స్మృతులను నెమరేసుకుంటుడవచ్చు. నేటి తరం రాజకీయ నేతలకు ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లో వ్యవహరించిన తీరును అందరూ అనుసరించాల్సిన మార్గమే.