నేడే నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం.. షెడ్యూల్ ఇదే
ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని 64,500 చదరపు మీటర్ల పరిధిలో, నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో ఒకేసారి 1224 మంది..
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంకోసం కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) ఏర్పాట్లు చేసింది. 2020 డిసెంబర్ 10న పార్లమెంట్ నూతన భవనంకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన విషయం విధితమే. ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని 64,500 చదరపు మీటర్ల పరిధిలో, నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు ఉన్నాయి. ఎంపీలకోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి.
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని నేడు (మే28) ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రెండు విడతలుగా పార్లమెంట్ ప్రారంభోత్సవం జరగనుంది. ఉదయం పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. తమిళనాడు నుంచి వచ్చిన వేదపండితులు ఉదయం 7.30 గంటల నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఉదయం 8.30 గంటలకు పార్లమెంట్ ప్రాంగణంలోని గదులు, ఛాంబర్స్ ను ప్రధానమంత్రి, ప్రముఖులు సందర్శిస్తారు. ఉదయం 9 గంటలకు ప్రార్థనా సభ ఉంటుంది. ఉదయం 11.30 గంటలకు పార్లమెంట్ కు అతిథులు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వేదికపైకి చేరుకుంటారు. 12.07 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. 12.10 గంటలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్వాగత ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12.29 గంటలకు ఉపరాష్ట్రపతి సందేశం, 12.38 గంటలకు ప్రతిపక్ష నేతల ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12.43 గంటలకు లోక్ సభ స్పీకర్ ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటలకు ప్రధాని మోదీ 75 రూపాయల నాణెం స్టాంపును విడుదల చేస్తారు. మధ్యాహ్నం 1.10 నిమిషాలకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.