ఇండియాలో పన్నులు కట్టని వారెందరో తెలుసా?

Update: 2017-02-01 07:51 GMT

2017 యూనియన్ బడ్జెట్‌ సందర్భంగా దేశంలో పన్నులు కట్టే వారి విషయంలో ఆసక్తికరమైన విషయాలను అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రకటించారు. సరళమైన పన్నుల వ్యవస్థ ఉన్న దేశంలో ఆదాయానికి తగ్గట్లుగా పన్నులు రాకపోవడం ప్రభుత్వానికి సమస్యగా మారుతుందని చెప్పారు. దేశంలో 4.2 కోట్ల మంది సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులున్నారని, వారిలో 1.7 కోట్ల మంది మాత్రమే ఆదాయపన్ను రిటర్న్ లు దాఖలు చేస్తున్నారని., అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు., పారిశ్రామిక రంగంలో 5.6 కోట్ల మంది ఉంటే వారిలో 1.81కోట్ల మంది మాత్రమే రిటర్న్ లు దాఖలు చేస్తున్నారట. దేశంలో 2014 నాటికి 13.94 లక్షల రిజిస్టర్డ్‌ కంపెనీలు ఉంటే వాటిలో 2016-17లో 5.97లక్షల కంపెనీలు మాత్రమే రిటర్న్ లు వేశాయన్నారు. ఈ 5.97లక్షల కంపెనీల్లో కూడా 2.76లక్షల కంపెనీలు నష్టాలను చూపడమో., జీరో ఆదాయాన్ని లెక్క చూపడమో చేశాయన్నారు. 2.85 లక్షల కంపెనీలు కోటి రుపాయల ఆదాయం చూపితే 28,606ల కంపెనీలు కోటి నుంచి పదికోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపాయట. 7,781 కంపెనీలు మాత్రమే పదికోట్లకు మించి ఆదాయాన్ని లెక్కగా చూపించాయని జైట్లీ లోక్‌సభలో ప్రకటించారు.

వ్యక్తి గత పన్ను చెల్లింపుదారులూ అంతే...

3.7 కోట్ల వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల్లో 2015-16 ఆర్ధిక సంవత్సరంలో 99లక్షల మంది 2.5 లక్షల లోపు ఆదాయం మాత్రమే లెక్క చూపారట. 1.91 కోట్ల మంది రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయాన్ని చూపితే 52 లక్షల మంది ఐదు నుంచి 10లక్షల ఆదాయాన్ని రిటర్న్ లో చూపారని జైట్లీ సభకు తెలిపారు. కేవలం 24లక్షల మంది మాత్రమే పది లక్షలకు మించి ఆదాయాన్ని రిటర్న్ లో లెక్క చూపించారట. ఐదు లక్షలకు మించి ఆదాయాన్ని చూపిన పన్ను చెల్లింపుదారులు 76లక్షల మంది ఉంటే వారిలో వేతన జీవులు 56లక్షల మంది ఉన్నారట. 20లక్షల నుచి 50లక్షల ఆదాయం దాటిన వాళ్లు దేశంలో 1.72 కోట్లమంది మాత్రమే ఉంటే., గత ఆర్ధిక సంవత్సరంలో కార్ల కొనుగోళ్లు మాత్రం 1.25కోట్లు దాటాయని జైట్లీ సభకు గుర్తు చేశారు. ఇక విదేశీ పర్యటనలు చేసిన వాళ్లు దేశంలో 2 కోట్లమందికి పైగానే ఉండగా పన్ను చెల్లింపుదారులుమాత్రం లక్షల్లో ఉండటమే నోట్ల రద్దు వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటని మంత్రి చెప్పారు.

బ్యాంకుల్లో ఉన్న డబ్బుకు లెక్క చెప్పాల్సిందే......

నోట్ల రద్దు తర్వాత నవంబరు 8 నుంచి డిసెంబర్‌ 30 మధ్య 1.9 కోట్ల ఖాతాల్లోకి రెండు లక్షల నుంచి 80లక్షల రుపాయలు జమ అయ్యాయని., సగటున ఒక్కో ఖాతాలోకి 5.03లక్షల జమ అయ్యాయని జైట్లీ చెప్పారు. 80లక్షల మించిన మొత్తం కోటి 48లక్షల అకౌంట్లలో జమ అయ్యిందని., వాటిలో సగటున 3.31 కోట్లు జమ అయ్యాయని చెప్పారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో చేరిన మొత్తాలపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని., ఈ డబ్బు మొత్తానికి లెక్కలు చెప్పాల్సిందేనని., పన్ను పరిధిలోకి రానున్నందున ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని జైట్లీ ప్రకటించారు.

Similar News