ఇక ఓటర్ల చేతిలోనే వీరి భవిష్యత్తు

Update: 2017-02-02 12:15 GMT

రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఈ నెల 4వ తేదీన జరగనున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా సాగించాయి. మ్యానిఫేస్టోలతో అదర గొట్టాయి. హామీలతో ఊదరగొట్టాయి. పంజాబ్ లో 117 నియోజకవర్గాలకు, గోవాలో 40 నియోజకవర్గాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జరిగే రెండు రాష్ట్రాల్లో కమలనాధులు వారి మిత్ర పక్షాలే అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికలు సవాలుగా మారాయి. ప్రచారం ముగియడంతో ఇక ఓటర్ల చేతిలోనే నేతల భవిష్యత్తు ఉంది.

పంజాబ్ లో త్రిముఖ పోరు...

పంజాబ్ లో అకాళీదళ్, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతోంది. బీజేపీ, అకాళీదళ్ కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు గెలుపు కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాయి. మూడు పార్టీల నుంచి దాదాపు 351 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ బీజేపీ కూటమి తరుపున పలు బహిరంగ సభల్లో ప్రసంగించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పంజాబ్ ఎన్నికలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కన్పిస్తోంది. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా పార్టీలో చేరడంతో పార్టీకి మంచి ఊపొచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెప్టెన్న అమరీందర్ పేరును రాహుల్ ప్రకటించారు కూడా. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో సుడిగాలి పర్యటనలు చేశారు. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు అరవింద్ ప్రయత్నించారు. పంజాబ్ లో మాదక ద్రవ్యాల మాఫియా కొన్నేళ్లుగా రెచ్చిపోతోంది. దీన్ని అదుపు చేయలేక పోయారని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీలు బీజేపీ కూటమిపై విరుచుకుపడ్డాయి. తాము అధికారంలోకి వస్తే డ్రగ్స్ మాఫియాను రూపుమాపుతామని మేనిఫేస్టోలో అన్ని పార్టీలూ ప్రకటించాయి. పంజాబ్ లో కోటి 92 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 22,600 పోలింగ్ కేంద్రాల్లో వీరంతా ఓటు వేయనున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లపైనే ఎక్కువగా పార్టీలు దృష్టి పెట్టాయి. కొత్త ఓటర్లను ఆకర్షించుకునేలా తమ మేనిఫేస్టోలను విడుదల చేశాయి.

గోవా...గోదాలో గెలుపెవరిది....?

ఇక గోవా విషయానికి వస్తే గోవాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గోవాలో 40 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా త్రిముఖ పోటీయే నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీలు గెలుపు కోసం హోరాహోరా పోరాడుతున్నాయి. చిన్న రాష్ట్రం కావడంతో ఆమ్ ఆద్మీ ఎలాగైనా గోవాను దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. గోవాలో మొత్తం పది లక్షల 85 వేల మంది ఓటర్లున్నారు. ఇందుకోసం 1642 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. ఇక్కడ ప్రధానంగా కాసినోల అంశంపైనే అన్ని పార్టీలూ దృష్టి పెట్టాయి. సముద్ర తీరప్రాంతంలో ఉన్న కేసినోల అనుమతులను రద్దు చేయాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే కేసినోలను రద్దు చేస్తామని కూడా మేనిఫేస్టోలో ప్రకటించాయి. కేసినో ల వల్ల మాండవి నది అందాలను చెడిపోతున్నాయన్నది ఈ పార్టీల వాదన. బీజేపీ కేసీనోలను రద్దు చేయకపోవడాన్ని తప్పుపడుతున్నాయి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీలు. అయితే బీజేపీ మాత్రం విభిన్న వాదనను విన్పిస్తోంది. అసలు కేసినోలకు అనుమతిచ్చిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పడని చెబుతోంది. కేసినోలను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి పార్సేకర్ చెబుతున్నారు. ఇక ఆమ్ ఆద్మీ గోవా తీరాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. గోవాలో జరుగుతున్న అవినీతిని అరికడతామని అర్ వింద్ కేజ్రీవాల్ అక్కడి ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మొత్తం మీద ఎన్నికలతో గోవా సముద్ర తీరం వేడెక్కిపోయింది. మరి గోవా ఎవరికి దక్కుతుందనేది మరికొంత కాలం వేచిచూడాల్సిందే.

Similar News