ఈ కాఫీ తాగితే అబ్బో...అనక మానరు..

Update: 2017-02-05 09:00 GMT

ఉదయాన్ని నిద్ర లేవగానే కప్పు కాఫీ పడందే మనసు ఊరుకోదు. కాఫీకి అంత ప్రయారిటీ ఉంది దైనందిన జీవితంలో . కాఫీ కోసం కొట్లాడేవారున్నారన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత టేస్ట్ ఉన్న కాఫీని ఇప్పుడు మన రాష్ట్రంలో పండిస్తున్నారు. ఇందుకు విశాఖ జిల్లా అరకుకు వెళితే కాఫీ ఘుమఘుమలను తనివిదీరా ఆస్వాదించవచ్చు. అరకు కాఫీ అదరగొట్టేస్తుంది గురూ...అంటూ మీరే అరిచేస్తారు. ప్రస్తుతం సీజన్ కావడంతో అరుకులోని కాఫీ తోటలన్నీ కళకళలాడుతున్నాయి.

అంతర్ పంటగా మిరియాలు...

విశాఖ జిల్లాలోని అరకు లో ని 11 గిరిజన మండలాల్లో కాఫీ తోటలు ఏపుగా పెరిగాయి. అరకు, అనంతగిరి, డుంబ్రిగు, పెదబయలు, ముంచింగ్ పూట్, జి.మాడుగుల, జి.కెవీధి మండలాల్లో వేలాది ఎకరాల్లో కాఫీ పంట సాగవుతోంది. కొండ వాలు ప్రాంతం కావడంతో కాఫీ పంటకు అనుకూలంగా ఉందని గుర్తించిన గిరిజనులు ఈ పంటపైనే ఉత్సాహం చూపుతున్నారు. కాఫీతోటల్లో అంతర్ పంటగా మిరియాల సాగును కూడా చేస్తూ శభాష్ అనిపిస్తున్నారు. ఒకసారి కాఫీ పంట వేసి మూడేళ్లు ఆగితే దిగుబడి మొదలవుతుంది. అప్పటి నుంచే ఆదాయం సమకూరుతుంది. అయితే మూడేళ్లు ఓపిక పట్టాల్సి ఉంటుంది. పెట్టుబడి వ్యయం కూడా తక్కువే ఉండటంతో ఎక్కువ మంది గిరిజనులు ఈపంట వైపే మొగ్గు చూపుతున్నారు.

16 రకాల కాఫీ గింజలు....

గిరిజనులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కాఫీ డెవలెప్ మెంట్ బోర్డును కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. దీనితో పాటు సెంట్రల్ కాఫీ బోర్డుకూడా రైతులకు ఉచితంగా మొక్కలను, ఎరువులను సరఫరా చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. అరకు ప్రాంతంలో దాదాపు లక్షా ఇరవై వేల ఎకరాల్లో కాఫీ పంట సాగవుతోంది. దీన్ని మరింత పెంచాలని ఏపీ ప్రభుత్వం భావించి రైతులకు ప్రోత్సాహకాలనూ ప్రకటించింది. అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక్కడ కాఫీ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. అరకు ఆర్గానిక్ కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. అయితే మార్కెటింగ్ విషయంలోనే ఇక్కడి రైతులు విఫలమవుతున్నారు. దీనిని గమనించిన ఒక స్వచ్ఛంద సంస్థ రైతుల నుంచి కాఫీ గింజలను కొనుగోలు చేసి ప్రపంచదేశాలకు విక్రయిస్తుండటంతో గిరిపుత్రులకు కొంత ఆదాయం సమకూరుతోంది. ఇటీవల కాలంలో గిరిజన సహకార సంస్థ కూడా కాఫీ కొనుగోళ్లు చేయడంతో రైతులకు ఊరటనే చెప్పవచ్చు. అరకుకు వచ్చే పర్యాటకులు కూడా ఇక్కడ కాఫీని రుచి చూసి ఆహా ఏమి రుచి అని అంటున్నారు. మొత్తం 16 రకాల కాఫీ గింజలను ఇక్కడ తయారు చేస్తున్నారు. మొత్తం మీద మీరూ అరకు వెళితే...కాఫీ రుచి చూడటం మాత్రం మర్చిపోవద్దు సుమా.....

Similar News