కాటమరాయుడిలో క్లారిటీ లేదా?

Update: 2017-01-27 07:35 GMT

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ యువత ఇచ్చిన నిరసనకు పవన్ మద్దతు తెలిపారు. ట్వీట్ల మీద ట్వీట్లతో నిరసనకు ఒక ఊపు తెచ్చారు. గంట గంటకూ అప్ డేట్ చేస్తూ మీ వెంట నేనున్నానని ఆందోళనకారులకు భరోసా ఇచ్చారు. అలాంటి పవన్ మీడియా సమావేశంలో ఆ హీట్ తగ్గకుండా ఏదో కార్యక్రమానికి పిలుపునిస్తారని, తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే పాడిన పాటనే పవన్ మళ్లీ పాడారు. తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాలపై పవన్ విరుచుకుపడ్డారు. ఆందోళనను అణిచి వేయడం సరికాదని చంద్రబాబుకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. మీరు ఆపితే అది వాయిదా మాత్రమే అవుతుందని చెప్పుకొచ్చారు. కాని వాయిదా ఎన్నాళ్లు?ఈ వేడి చల్లారితే మళ్లీ ఉద్యమం ఊపందుకుంటుందా? ఇదీ ఏపీ యువతలో తలెత్తుతున్న ప్రశ్నలు.

కటీఫ్?...సపోర్ట్?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందరూ ఒప్పుకుని తీరవల్సిందే. జిల్లాల వారీగా సభలు ఏర్పాటు చేసి యువతను చైతన్య పరుస్తున్నారు. కాని పవన్ స్టాండ్ ఏమిటో జుట్టు పీక్కున్నా అర్ధం కావటం లేదంటున్నారు జనసేన కార్యకర్తలే. ఆయన ఇంతకూ తెలుగుదేశానికి మద్దతు తెలిపినట్లా? కటీఫ్ చెప్పినట్లా? అర్ధం కావడం లేదంటున్నారు. బీజేపీపై మండిపడ్డ పవన్ చంద్రబాబు అండ్ టీంపైన కూడా అదేస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ విధానాలు ఇలాగే కొనసాగితే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని హెచ్చిరిస్తూనే చంద్రబాబు అంటే తనకు గౌరవమన్నారు. చంద్రబాబు పక్కన వ్యక్తులే ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అంశం ఇక ముగిసిపోయినట్లేనని చంద్రబాబు నుంచి మంత్రుల వరకూ అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. వారు ఆనిర్ణయానికి వచ్చిన తర్వాత టీడీపీని నిందించి ప్రయోజనం లేదు. ఉద్యమించి సాధించుకుంటే సాధించుకున్నట్లు. లేకపోతే లేదు. అంతేకాని పవన్ కర్ర విరగకుండా ....పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం.

ఎన్నికల వరకూ ఆగుతారా?

పవన్ మీడియా సమావేశంలో టీడీపీ ఎంపీలను టార్గెట్ చేశారు. చంద్రబాబు మంచోడని పరోక్షంగా చెబుతూనే ఆ పార్టీ నేతల తీరును తప్పుపట్టారు. చంద్రబాబు పరిపాలన దక్షతను చూసే తాను గత ఎన్నికల్లో సపోర్ట్ చేశానని చెప్పిన పవన్ భవిష్యత్తులో ఆ పార్టీతో ఎలా వ్యవహరించబోతున్నానో చెప్పలేదు. ఇలాగే ఉంటే తన దారి తాను చూసుకుంటానని చెప్పారు తప్ప బయటకు వెళ్తానని మాత్రం చెప్పలేకపోయారు. అంటే పవన్ లో ఇంకా టీడీపీపై ఆశలున్నట్లు కన్పిస్తుందన్నది పరిశీలకుల భావన. మోడీ, వెంకయ్య వేసిన సెటైర్లు, విసుర్లు చంద్రబాబుపై వెయ్యకపోవడం కూడా ఇదే కారణమంటున్నారు. అసలు జనసేనను వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న క్లారిటీ కూడా కాటమరాయుడిలో లేనట్టు కన్పిస్తోంది. ప్రత్యేక హోదాపై ఇప్పుడే తాను ప్రత్యక్షంగా ఉద్యమంలోకి దిగితే వచ్చే ఎన్నికల్లో వెళ్లేందుకు వేరే అంశం లేకుండా పోతుందని పవన్ ఆలోచిస్తున్నారా? ఎన్నికలు మరో ఏడాది ఉన్నప్పుడు ఉద్యమాన్ని స్టార్ట్ చేద్దామనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు జనసేన అధినేత వద్ద సమాధానల్లేవు. నీ సినిమా రిలీజ్ డేట్ కోసం నీ అభిమానులు ఎదురుచూసినట్లు ఆందోళనకారులు ఉండరు. ఇప్పటికైనా క్లారిటీతో రా అని అంటున్నారు ఏపీ యువత.

Similar News