కోనసీమలో ఏం జరుగుతోంది?

Update: 2017-01-24 07:30 GMT

కోనసీమలో టెన్షన్ టెన్షన్ గా ఉంది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పోలీసులు నో చెప్పేశారు. ముద్రగడ అనుచరులు మాత్రం పాదయాత్ర చేసి తీరుతామంటున్నారు. ఇప్పటికే కోనసీమలో ఉద్యమకారులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. భారీగా పోలీసులను మొహరించారు. 16వనెంబరు జాతీయ రహదారిపై పోలీసులు కవాతును కూడా నిర్వహించారు. ముద్రగడ పోలీసుల అనుమతి కోరలేదని, ఆయన దరఖాస్తు పెట్టుకుంటే పరిశీలిస్తామని రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప చెబుతున్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లో పోలీసుల అనుమతి కోరబోమని, గతంలో నిర్వహించన యాత్రలకు పోలీసుల అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు కాపు సంఘం నేతలు. గాంధేయ మార్గంలో తమ నేత పాదయాత్రను అడ్డుకుంటే ఊర్కునేది లేదని హెచ్చరిస్తున్నారు. దీంతో కోనసీమలో ఉత్కంఠత నెలకొని ఉంది.

పాదయాత్ర చేసి తీరతాం.....

ఈ నెల 25వ తేదీన ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఆయన పాదయాత్ర తలపెట్టారు. అయితే తూర్పుగోదావరి పోలీసులు పాదయాత్రకు అనుమతి లేదని చెప్పేశారు. అయితే ఇప్పటికే ముద్రగడ పాదయాత్రకు సన్నద్దమవుతున్నారు. కాపు జేఏసీ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రావులపాలె, కొత్తపేట, అయినవల్లి, ముమ్మడివరం, అమలాపురం, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు వంటి ప్రాంతాల్లో ముద్రగడకు స్వాగతం పలుకుతూ పెద్దయెత్తున్న స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను కట్టారు.

కిర్లంపూడిలోనే అరెస్ట్ చేస్తారా?

తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే 144వ సెక్షన్ ను అమల్లోకి తెచ్చారు. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, ఎస్పీ రవిప్రకాష్ లు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసులను రంగంలోకి దించారు. కోనసీమలో మూడు వేల మంది, కిర్లంపూడి లో రెండు వేల మంది, మిగిలిన ప్రాంతాల్లో మూడు వేల మంది మొత్తం 8వేల మంది పోలీసులు జిల్లాకు చేరుకున్నారు. మరికొన్ని అదనపు బలగాలను కూడా రప్పిస్తున్నారు. రావుల పాలెం నుంచి పాదయాత్రలో పాల్గొనేందుకు ఈరోజు సాయంత్రం ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి నుంచి రావులపాలేనికి బయలుదేరతారు. అయితే పోలీసులు ముద్రగడను కిర్లంపూడిలోనే ఆయనను గృహనిర్భంధం చేస్తారా? లేక రావులపాలెం లో అదుపులోకి తీసుకుంటారా? అనేది పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించాల్సి ఉంది.

సోషల్ మీడియాపై ఆంక్షలు....

పోలీసులు ప్రధానంగా సోషల్ మీడియాపైన దృష్టి సారించారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారు. వదంతులను, తప్పడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే అరెస్ట్ లు తప్పవని హెచ్చిరించారు. బల్క్ మెసేజ్ లు, మొబైల్ డేటా సర్వీసులు నిలిపేయాలని ఇప్పటికే సర్వీస్ ప్రొవైడర్లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తాము మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకూ బల్క్ మెసేజ్ లు, మొబైల్ డేటా సర్వీసులను పునరుద్ధరించవద్దని కలెక్టర్ ఆదేశించారు. ఎలక్ట్రానిక్ మీడియా కూడా లైవ్ కవరేజీలు ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రాంతంలో నెట్ వర్క్ ను కూడా నిలిపేయనున్నారు. మొత్తం మీద కోనసీమలో ముద్రగడ పాదయాత్ర జరుగుతుందా? లేదా? అనే టెన్షన్ సర్వత్రా నెలకొని ఉంది. ముద్రగడ మాత్రం ప్రస్తుతం మౌనంగానే ఉన్నారు. మరికొన్ని గంటల్లో ముద్రగడ పాదయాత్ర చేస్తారా? లేదా? అన్నది తేలిపోనుంది.

 

 

Similar News