గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్‌

Update: 2017-02-01 06:32 GMT

నోట్ల రద్దుపై సభ్యుల ఆందోళనలపై స్పందిస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన జైట్లీ సరైన నిర్ణయం ఎన్నడూ విఫలమవద్దన్న గాంధీ మాటల్ని ఉటంకిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నోట్ల రద్దు పరిణామాలు ఎక్కువ కాలం కొనసాగవని ఆర్ధిక మంత్రి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాల ప్రకారం ప్రపంచ జిడిపి వృద్ధి 2016 3.4శాతం., 2017లో .3.4 శాతం ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ వృద్ధికంటే మెరుగైన ఫలితాలను భారత్‌ సాధించిందని జైట్లీ ప్రకటించారు. గ్రామీణ ప్రజల వికాసమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేశామని., కనీసం కోటిమంది గ్రామీణ కుటుంబాలను పేదరికానికి దూరం చేసే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రజలు., గిరిజనుల వికాసమే ధ్యేయంగా నిధుల కేటాయించినట్లు చెప్పారు.

రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు...

ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళల భాగస్వామ్యం 55శాతం ఉందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగ్గా తీర్చేందుకు బడ్జెట్‌ కేటాయింపులు 40వేల కోట్ల నుంచి 48వేల కోట్లకు పెంచుతున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు మార్గాలను విస్తరించే లక్ష్యంతో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్‌ యోజనలో భాగంగా 2011-14 మధ్య కాలంలో రోజుకు 73కి.మీల కొత్త రోడ్లను నిర్మిస్తే 2016-17లో రోజుకు 133 కిమీల రోడ్లను నిర్మించినట్లు మంత్రి చెప్పారు. నాబార్డు ద్వారా 8వేల కోట్లతో డెయిరీ రంగ అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 2017 బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు మంత్రి చెప్పారు. ఇందుకోసం 2017-18 ఆర్ధిక సంవత్సరంలో 10లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నిర్మించే ఇళ్ల రుణ చెల్లింపు గడువును 15ఏళ్ల నుంచి 20ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మైక్రో ఇరిగేషన్ రంగానికి 5వేల కోట్లతో ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యం...

సాగునీటి కోసం 40 వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయానికి 1, 87,223 కోట్లు కేటాయించారు. 8వేల కోట్లతో డెయిరీ అభివృద్ధికి ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. వ్యవసాయ పనులకు గ్రామీణాభివృద్ధి ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని, 2019 నాటికి గ్రామాల్లో పేదలకు కోటి ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. నాబార్డుతో సహకార బ్యాంకుల అనుసంధానం చేస్తామని చెప్పిన జైట్లీ సురక్షిత మంచినీటి కోసం ఐదు లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యారంగాభివృద్ధి కోసం ప్రత్యేక డీటీహెచ్ ఛానల్ ప్రారంభించనున్నామని చెప్పారు. గర్భిణులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ఆరేవేల నగదు బదలాయింపు చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకానికి 48 వేల కోట్లు. గ్రామీణాభివృద్ధికి మూడు లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గ్రామజ్యోతి యోజనకు 4,300 కోట్లు. అంత్యోదయ యోజనకు 2,300 కోట్లు కేటాయించినట్లు జైట్లీ తెలిపారు.

Similar News