జగన్ అడుగుపెడితే విధ్వంసమేనా?

Update: 2017-01-31 14:30 GMT

వైసీపీ అధినేత జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విధ్వంసం జరుగుతుందా? జగన్ ఎక్కడ పర్యటనలు జరిపినా అక్కడ ప్రమాదాలు జరుగుతాయా? ఎక్కడకు వెళ్లినా అక్కడకు రాయలసీమ గూండాలు వస్తారా? ఇది కొంతకాలంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ అధికార పార్టీ నుంచి ఎదుర్కొంటున్న విమర్శలు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అధిక శాతం మంది నెటిజన్లు దీనిని తప్పుపడుతున్నారు. జగన్ ను కావాలని అధికార పార్టీ టార్గెట్ చేస్తుందని సోషల్ మీడియాలో హెరెత్తిపోతోంది. ప్రతిపక్ష నేత ప్రజా సమస్యలపై స్పందించకూడదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కనీసం శాసనసభ్యుడు కాని వ్యక్తి ప్రశ్నలకు స్పందించే ప్రభుత్వం...ప్రతిపక్ష నేత లేవనెత్తే సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఎదురు దాడేనా?....

ప్రత్యేక హోదా కోసం ఏపీ యూత్ ఇచ్చిన పిలుపుకు వైసీపీ కూడా స్పందించింది. ప్రత్యేక హోదా ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని పేర్కొంది. జగన్ కూడా తాను విశాఖలో తమ పార్టీ ఆధ్వర్యంలో జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని చెప్పారు. అందులో భాగంగానే విశాఖకు వెళ్లారు. కాని జగన్ ను విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచే వెనక్కు పంపించి వేశారు పోలీసులు. జగన్ విశాఖ కు వస్తే విధ్వంసం సృష్టిస్తారని సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే ఆరోపించారు. రాయలసీమ గూండాలను దింపి విశాఖలో శాంతిభద్రతలను భగ్నం చేయడానికి జగన్ ప్రయత్నిస్తారని టీడీపీ నేతలు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పేశారు. ఇక మొన్న అమరావతి రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు జగన్ వస్తే రాద్ధాంతం చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. భూమా అఖిలప్రియ విషయాన్ని అడ్డంపెట్టి తమ కార్యకర్తలపై అక్రమకేసులు పెట్టించారని చెబుతున్నారు.

ప్రశ్నలకు సమాధానాలు లేవా?

ఇక నిన్న జగన్ కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రైతులను పరామర్శించారు. జగన్ వెళ్లిన కొద్దిసేపటికే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలో జగన్ సభ పెట్టిన భూమి యజమానిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. తన అనుమతి లేకుండానే తన పొలంలో సభను ఎలా పెడతారని ఆ రైతు ప్రశ్నించారు. జగన్ విజయవాడకు కడప రౌడీలను తీసుకొచ్చి రైతులను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోపించారు. జగన్ పై కేసు నమోదు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఈ సంఘటనలన్నింటిపైనా సోషల్ మీడియా వేదికగా పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత రాష్ట్రంలో పర్యటించకూడదా? ప్రజా సమస్యలపై స్పందించకూడదా? రాష్ట్రంలో అడుగు పెడితే విధ్వంసానికి వచ్చినట్లేనా? అలాగయితే జగన్ పై ఆంక్షలు విధించండి అంటూ పెద్ద సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. కేవలం ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చు కోవడానికే జగన్ పై విమర్శల దాడికి దిగుతున్నారన్న వ్యాఖ్యలు ఎక్కువగానే విన్పిస్తున్నాయి. ఒక ప్రతిపక్ష నేత స్పందించాల్సింది సమస్యలపైనే. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి దానిని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్ష నేతదే. అయితే ఏపీలో రివర్స్ సీన్ కన్పిస్తోంది. అసెంబ్లీలో లేని నేతలు ప్రస్తావిస్తే ప్రభుత్వం స్పందిస్తుంది. ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తే మాత్రం విధ్వంసం అని, అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ ఎదురు దాడికి దిగుతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. జగన్ అంటేనే ప్రభుత్వం భయపడుతుందా? లేక ఆయన లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగుతుందా? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిపక్ష నేత లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

Similar News