జగన్ గేట్లు మూసేశారా..?

Update: 2017-01-30 01:30 GMT

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి పాతగాయాలను మర్చిపోయినట్లు లేదు...... పార్టీలో కొత్త వారిని చేర్చుకునే విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. 2014 ఎన్నికలు నేర్పిన గుణపాఠంతో పార్టీ మారుదామని వచ్చే వారి విషయంలో వెంటనే స్పందించడం లేదట. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులైనా., మరో పార్టీ నేతలైనా మొహమాటానికి పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్లు కేటాయించే అవకాశం లేదని తెగేసి చెబుతున్నారట. ప్రకాశం జిల్లాకు చెందిన నేతలకు ఇలాంటి అనుభవమే ఎదురైందట....ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండటంతో ఆశావహులు జగన్‌ దృష్టిలో పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట.... వైఎస్సార్‌సీపీ గుర్తుతో గెలిచి ఆ తర్వాత రకరకాల కారణాలతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వారి స్థానంలో కొన్ని చోట్ల ఇన్‌ఛార్జిలకు బాధ్యతలు అప్పగించగా మరికొన్ని చోట్ల టీడీపీ., బీజేపీలలో ఓడిపోయిన అభ్యర్ధులకు అవకాశం కల్పించారు.

వెంటరాని వారిని వద్దంటున్న యువనేత....

అయితే ఈ క్రమంలో 2009 రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత మోసం చేసిన నాయకుల్ని మాత్రం జగన్‌ ప్రత్యేకంగా గుర్తు ఉంచుకున్నారట......రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత జగన్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని సంతకాలు చేసి ఆ తర్వాత అధిష్టానం కన్నెర్ర చేయడంతో వెనక్కు తగ్గిన నేతల్లో చాలామంది పిల్లిమొగ్గలు వేశారట. మొదట్నుంచి జగన్‌కు వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చి ఆ తర్వాత అతనిపై విమర్శలు చేసిన వారు కూడా ఇటీవల వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో పార్టీకి పనికొస్తారో లేదో తెలుసుకున్నాకే వారికి ఛాన్స్‌ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. 2010-11 మధ్య కాలంలో జగన్‌కు కేంద్రంలో కీలకమైన పదవి దక్కుతుందని భావించిన సమయంలో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. జగన్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. ఓదార్పు పేరుతో జగన్‌ ప్రారంభించిన పరామర్శలను నిలిపివేయాలంటూ సోనియా స్వయంగా ఆదేశించడంతో ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. జగన్‌ కుటుంబం మొత్తం సోనియాతో భేటీ అయినా వారికి ఊరట లభించకపోవడంతో సొంత పార్టీ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. కాంగ్రెస్‌ అధిష్టానంతో విబేధాలు ముదిరిన సమయంలో చాలామంది ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు జగన్‌కు మనస్తాపాన్ని కలిగించిందని చెబుతారు.

తన వెంట రాని వాళ్లకు నో ఎంట్రీ...

జగన్‌ కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిన సమయంలో ప్రకాశం ., నెల్లూరు జిల్లాలకు చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి., పురంధేశ్వరి దంపతులు., పనబాక లక్ష్మీ.,ఆమంచి కృష్ణమోహన్‌., ఉగ్ర నరసింహారెడ్డి., గొట్టిపాటి తదితరులు మాగుంట నివాసంలో భేటీ అయ్యారు. జగన్‌కు వ్యతిరేకంగా వైఎస్‌ మరణంతో చనిపోయిన వారిని కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా పరామర్శించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పెద్దల అమోదంతో పురంధేశ్వరి కేంద్ర మంత్రి హోదా జగన్‌ ప్రత్యేకంగా పరామర్శ చేపట్టాల్సిన పని లేదని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీలే కుటుంబానికి రెండు లక్షల పరిహారం ఇస్తాయని ప్రకటించారు. ఈ పరిణామాలన్ని తెలిసిన జగన్‌ గతంలో తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో పావులు కదిపిన నేతల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరైనా పార్టీలో చేరుతామని ముందుకు వస్తున్నా గతంలో వారి ట్రాక్‌ రికార్డ్‌ పరిశీలించిన తర్వాతే స్పందిస్తున్నారు. ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ., సీనియర్‌ నాయకుడు మహీధర్‌ రెడ్డి కూడా కొద్ది నెలల క్రితం వైఎస్సార్‌సీపీలో చేరేందుకు జగన్‌తో భేటీ అయ్యారు. అయితే మహీధర్‌ రెడ్డి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినా ఆయన చేసిన ఇతర ప్రతిపాదనలకు మాత్రం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో ఆయన చేరిక నిలిచిపోయిందట. ఇక ఇటీవల విజయవాడ విమానాశ్రయంలో ఉగ్ర నరసింహారెడ్డికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట. జగన్‌తో మాట కలిపేందుకు ప్రయత్నించిన ఉగ్ర నరసింహారెడ్డిని 2014 లో ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయని జగన్‌ ప్రశ్నించడంతో అవాక్కయడట.... గతంలో ఉగ్ర వ్యవహారశైలి కారణంగానే జగన్‌ ఇలా స్పందించి ఉంటారని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరుగుతున్నా వచ్చే ఎన్నికల మీద జగన్‌ గట్టి ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది.

Similar News