ట్రంప్ మరో సీతయ్యేనా?

Update: 2017-01-31 12:05 GMT

ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. తాజాగా హెచ్ 1బీ వీసాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారు. స్వదేశీయులకు ఉద్యోగ నియామకాల్లో తొలిప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్‌తో అమెరికా అధ్యక్ష పదవిని దక్కించుకున్న ట్రంప్‌ ఆ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. నిరసనలు., విమర్శలు లెక్క చేయకుండా ఆంక్షల అస్త్రానికి పదును పడుతున్నారు. సిలికాన్‌ వ్యాలీలోని గూగుల్‌., ఫేస్‌బుక్‌., అమెజాన్‌., మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు ట్రంప్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. హైస్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫేర్ నెస్ యాక్ట్ 2017 ను కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జోలోఫ్రెన్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. దీంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల పరిస్థితి తలకిందులు కానుంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే హెచ్‌1బి వీసాల ద్వారా అమెరికా వెళ్లి పనిచేసే వారికి చిక్కులు తప్పకపోవచ్చు.

వణుకుతున్న సిలికాన్ వ్యాలీ....

ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో విదేశీయులు హెచ్‌1బి వీసా కింద పని చేయాలంటే అయా సంస్థలు సగటున 1.3లక్షల డాలర్ల వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. ఇది కంపెనీలకు పెనుభారం అవుతుంది. భారత్‌ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున వృత్తి నిపుణుల్ని నియమించుకుని కంపెనీలు నడిపించడం ఇక ముందు సాధ్యపడకపోవచ్చు. కొత్త నియామకాల్లో తొలి ప్రాధాన్యత అమెరికన్లకే ఇవ్వాలి. ఎక్కువ జీతాలిచ్చే స్థానాల్లో అమెరికన్లనే నియమించాలి. మొదట్లో అమెరికా కంపెనీల సౌలభ్యం కోసం ఈ విధానాలు సిద్ధం చేసినా క్రమేణా తక్కువ వేతనాలకు ప్రతిభావంతులు లభిస్తుండటంతో విదేశీయులకే ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఇది అమెరికన్ల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని భావించిన ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను జారీ చేశారు. ట్రంప్‌ తాజా నిర్ణయంతో భారత్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థల షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అమెరికాలో పనిచేస్తున్న వేలాది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం కానుంది. పని చేస్తున్న ఉద్యోగులకు కొత్త వేతనాలు ఇవ్వాలంటే ఆ భారం రెట్టింపు కానుంది. ఓ అంచనా ప్రకారం అమెరికాలో భారత ఐటీ ఉద్యోగులు ఇన్ఫోసిస్‌లో 33,289. టాటాలో 16,553, విప్రోలో 12,201, యాక్సెంచర్‌లో 9608.., ఐబిఎంలో 13,600, డెలాయిట్‌లో 7606, మైక్రోసాఫ్ట్‌లో 20,200, ఐగేట్‌లో 4553మంది పనిచేస్తున్నారు. వీరికి సగటున 60వేల డాలర్ల వేతనం లభిస్తోంది. ట్రంప్ తీసుకోబోతున్న నిర్ణయంతో ఐటీ షేర్ల ధరలు కూడా కుప్పకూలుతున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్ యూఎల్ టెక్నాలజీస్ ల మార్కెట్ విలువ దాదాపు రూ.48వేల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. మధ్య శ్రేణి ఐటీ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టాటా సొల్యుషన్స్, మాస్టెక్, మైండ్ ట్రీ, ఎంఫాసిస్, కేపీఐటీ, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, హెక్సావేర్, జియోమెట్రిక్ దాదాపు 5 శాతం మేర పడిపోతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఐటీ సబ్ ఇండెక్స్ 4 శాతం మేర క్షీణించింది.

హిస్టరీ..కంపల్సరీ.....

అలాగే అమెరికాకు వచ్చే విదేశీ పౌరులపై మరో అస్త్రాన్ని సంధించారు ట్రంప్. అమెరికాకు వెళ్లే ప్రతి పౌరుడూ తమ ఫోన్ నెంబర్లను, సోషల్ మీడియా వివరాలను, ఇంటర్నెట్ లో వారు సెర్చ్ చేసిన అంశాలను గురించి తెలియజేసే బ్రౌజింగ్ హిస్టరీని అందజేయాలన్న షరతులు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ సమాచారం ఇవ్వకుంటే అమెరికాలోకి అడుగు కూడా పెట్టనివ్వరు. ఈ అంశం ఇంకా చర్చల దశలోనే ఉందని వైట్ హౌస్ పాలసీ డైరెక్టర్ స్టీఫెన్ మిల్లర్ తెలిపారు. దీనిపై కూడా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రౌజింగ్ హిస్టరీని అడగటం అన్యాయమంటూ నిరసనలు కూడా విన్పిస్తున్నాయి. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే చేసుకుపోతున్నారు. తాను అనుకున్నది ఆచరణలో పెడుతున్నారు. మున్ముందు ట్రంప్ ఏం నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ సీతయ్య మరి. ఎవరి మాటా వినడు.

Similar News