పంజాబ్ పీఠంపై ఆప్ గురి

Update: 2017-01-28 02:38 GMT

ఢిల్లీ తరహాలోనే అధికారం పంజాబ్ లోనూ చేజిక్కించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ కూటమిని టార్గెట్ గా చేసుకుని పావులు కదుపుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రచారంలో తీరికలేకుండా గడుపుతున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలు దక్కించుకున్న ఆప్ ఈసారి పంజాబ్ పీఠంపై సామాన్యుడిని కూర్చోబెట్టాలని తీవ్రంగానే కృషి చేస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫేస్టోను కూడా విడుదల చేసింది ఆప్.

ఓటర్లను ఆకట్టుకునేలా.....

పంజాబ్ లో తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని ఆప్ తన మేనిఫేస్టోలో ప్రకటించింది. పంజాబ్ లో వేళ్లూనుకున్న డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదాన్ని మోపనున్నట్లు ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన నెలలోనే మాదకద్రవ్యాలను అరికట్టడమే కాకుండా...డ్రగ్స్ కు ఎడిక్ట్ అయిన వారిని సాధారణ మనుషులుగా మార్చేందుకు ప్రయత్నిస్తామంది. పంజాబ్ లో 25 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. ఆరోగ్య బీమాను కూడా ఆప్ ప్రకటించింది. ఏపీలో ఆరోగ్య శ్రీ మాదిరిగానే పంజాబ్ లో ని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఐదు లక్షల వరకూ ఉచితంగా వైద్య సదుపాయాలను కల్పిస్తామంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉన్న అవినీతిని అరికట్టేందుకు కరప్షన్ కంట్రోల్ ఎన్ ఫోర్స్ మెంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ తన ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది. 400 లోపు యూనిట్లున్న గృహ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తామని పేర్కొంది. ఐదు రూపాయలకే భోజనాన్ని రాష్ట్రంలోని అన్ని మండలాల్లో అందిస్తామని తెలిపింది. ఆమ్ ఆద్మీ మేనిఫేస్టో అందరినీ ఆకట్టుకునేలా ఉందన్నది విశ్లేషకుల భావన. మరి ఆమ్ ఆద్మీకి ఓటర్లు చేరువవుతారో? లేదో? వేచి చూడాల్సిందే.

Similar News