ముద్రగడ అడుగు ముందుకు వెయ్యలేరా?

Update: 2017-01-31 10:16 GMT

కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం ముందుకు సాగడం లేదు. పాదయాత్రకు కూడా పోలీసులు అనుమతించకపోవడంతో ఆయన ముందుకు కదలలేక పోతున్నారు. పాదయాత్రకు దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తామని పోలీసులు, తాను ఎందుకు అనుమతి కోరాలని ముద్రగడ ఇద్దరూ పట్టుబట్టడటంతో పాదయాత్ర ముందుకు సాగడం లేదు. ఇప్పటికి రెండుసార్లు పాదయాత్రను పోలీసులు అడ్డుకోగలిగారు. మరోవైపు తుని సంఘటన జరిగి ఈరోజుకు ఏడాది పూర్తయ్యింది. కాపు రిజర్వేషన్ పై పోరాటం ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వ కుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని కాపు జేఏసీ ఆరోపిస్తోంది.

తుని సంఘటనకు ఏడాది....

తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఐక్య గర్జనలో జరిగిన హింసాత్మక సంఘటనకు ఏడాది పూర్తయింది. తునిలో రైలును దగ్దం చేయడంతో పాటు పోలీసు వాహనాలను కూడా ఆందోళనకారులు తగులబెట్టారు. దీనిపై సీబీసీఐడీ విచారణ చేపట్టింది. ఏడాది నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ముద్రగడ కాపు రిజర్వేషన్ కోసం పోరాడుతూనే ఉన్నారు. పాదయాత్ర చేస్తామని ముందుకు వచ్చినప్పుడల్లా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ముద్రగడ ఇంటికే పరిమితమయ్యారు. అయితే తాను మాత్రం ఉద్యమాన్ని విడిచిపెట్టేది లేదని ప్రభుత్వానికి లేఖలపై లేఖలు రాస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కూడా ముద్రగడను ఏకిపారేస్తున్నారు. జగన్ చేతిలో ముద్రగడ కీలుబొమ్మంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు చేసిన వాగ్దానాన్ని విస్మరించారంటూ కాపు జేఏసీ ఆరోపిస్తోంది. కమిషన్ ను ఏర్పాటు చేసి ఆరు నెలల్లోగా రిపోర్ట్ తెప్పిస్తామని చెప్పిన చంద్రబాబు ఏడాది పైనే గడిచినా పట్టించుకోవడం లేదంటున్నారు కాపు నేతలు. మరోవైపు మంజునాధ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది.

ఉపకులాల్లో చిచ్చు....

ముద్రగడ కాపు ఉద్యమాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో మరోవైపు రాష్ట్రంలో కాపు ఉప కులాల్లో వ్యతిరేకత మొదలైంది. బలిజ, ఒంటరి కులస్థులు తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమను కాపుల్లో కలప వద్దని వారు ఆందోళనకు కూడా దిగుతామంటున్నారు. ఇంకోవైపు శెట్టిబలిజ, గౌడ్ కులస్థులు బీసీ రిజర్వేషన్లలో కాపులను చేర్చవద్దంటూ మంజునాధ కమిషన్ కు వినతిపత్రాలు అందిస్తున్నారు. వీరి వెనక తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉందని, ముద్రగడ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కాపు ఉపకులాలను, బీసీలను రెచ్చగొడుతున్నారని కాపు జేఏసీ చెబుతోంది. మొత్తం మీద తుని సంఘటన జరిగి ఏడాదైనా సీఐడి విచారణ కొనసాగుతూనే ఉంది. ముద్రగడ ఉద్యమం కూడా కొనసాగుతూనే ఉంది.

Similar News