రండి..రండి..రండి సీటు రెడీ...

Update: 2017-02-05 03:30 GMT

ఎస్... ఇక అదికారికం. తీర్థాన్ని శంఖంలో పోసేస్తున్నారు. జోడు గుర్రాల స్వారీకి సై . వారసుడు నారా లోకేశ్ కు టీడీపీ అదినేత చంద్రబాబునాయుడు పచ్చజెండా ఊపేసినట్లే. తన కుమారునికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కేబినెట్ బెర్తును కేటాయించేందుకు నిర్ణయించినట్లు స్వయంగా ముఖ్యమంత్రే వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఇంతకాలం రాజ్యాంగేతర శక్తిగా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ చెప్పినట్లవుతుంది. అటు పార్టీ పగ్గాలు, ఇటు ప్రభుత్వ బాధ్యతలు జమిలీగా నిర్వహించే బృహత్తర కర్తవ్యం లోకేశ్ భుజస్కంధాలపై ఉంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉగాది నాటికే ఆ శుభ ముహూర్తం ఖరారు కానుందంటున్నాయి పార్టీ వర్గాలు.

పార్టీ యంత్రాంగానికి తలలో నాలుకలా, ప్రభుత్వ మంత్రాంగానికి ఆరో వేలుగా ఉంటూ వచ్చిన చినబాబు లోకేశ్ కు ఇక తెరచాటు కష్టాలు తీరిపోనున్నాయి. కొంతకాలంగా లోకేశ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్ వినవస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి. కొందరు మంత్రుల విషయంలోనూ ప్రభుత్వ వ్యవహారాల్లోనూ లోకేశ్ చురుకైన పాత్రనే పోషిస్తున్నారు. ఇందువల్ల రాజ్యాంగేతర శక్తి అన్న ముద్రతోపాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలూ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకేశ్ ను మంత్రిగా నియమిస్తే ఆరోపణలకు అడ్డుకట్ట పడుతుందనే భావనలో తెలుగుదేశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీని, ప్రభుత్వాన్ని కూడా సమన్వయంతో ముందుకు నడిపేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే లోకేశ్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సభ్యత్వ నమోదు వంటి అంశాలు కూడా లోకేశ్ నేతృత్వంలోనే సాగుతున్నాయి. ఈరకంగా చూస్తే పార్టీ పరంగా చాలాకీలకమైన భూమికనే ఆయన పోషిస్తున్నారు. పొలిట్ బ్యూరో సమావేశాలకు సైతం ఎక్స్ అపీషియో సభ్యునిగా హాజరవుతున్నారు.

మరో రెండు సంవత్సరాల మూడునెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్చి , ఏప్రిల్ నాటికల్లా లోకేశ్ కు మంత్రి బాధ్యతలు అప్పగించడం మంచిదని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వర్గాలు చాలాకాలంగా ఈ సూచన చేస్తున్నప్పటికీ పక్కనపెడుతూ వచ్చిన చంద్రబాబు ఇక సమయం దగ్గరకు రావడంతో ఆలస్యం చేయకూడదని నిర్ణయించారు.

మంత్రివర్గంలో బెర్తు ఖాయమైనప్పటికీ ఏ పోర్టుఫోలియో ఇవ్వాలన్న అంశంలో తర్జనభర్జనలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. 28 ఏళ్ల వయసులో మంత్రి పదవి చేపట్టిన నారాచంద్రబాబు నాయుడు 1980 ప్రాంతాల్లో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య బాధ్యతలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీతో సినిమారంగానికి విడదీయరాని అనుబంధం. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీరామారావు అగ్రశ్రేణి నటుడు. ఇక చంద్రబాబు వియ్యంకుడు, లోకేశ్ మామయ్య బాలకృష్ణ కూడా నటవారసుడే. అందువల్ల లోకేశ్ కు చలనచిత్రరంగాన్ని ప్రభుత్వపరంగా పర్యవేక్షించే బాధ్యత ఇవ్వాలనే సెంటిమెంటు కూడా వ్యక్తమవుతోంది. దాంతోపాటు ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, వివిధ అంశాలపై మంత్రులతో సమీక్షలు నిర్వహించడానికి వీలుగా సమాచార శాఖ అప్పగిస్తే బాగుంటుందనే సూచనలూ వెలువడుతున్నాయి.ఇదే జరిగితే ప్రధాన కార్యదర్శిగా పార్టీ పరమైన సమీక్షలు నిర్వహించుకోవచ్చు. మరో వైపు ప్రభుత్వ కార్యక్రమాలపై యంత్రాంగాన్ని, మంత్రులను కూడా పరుగులు తీయించవచ్చనేది పార్టీ ఉన్నతస్థాయి యోచనగా తెలుస్తోంది. ఒకటిరెండు నెలల్లోనే ఈ చిక్కుముడి వీడిపోనుంది. పార్టీ వర్గాల దీర్ఘకాల నిరీక్షణకు తెరపడనుంది. అయితే ‘పంక్తీ మనదే. భోజనమూ మనదే ’ అయినప్పుడు ఎక్కడ కూర్చున్నా ..ఎప్పుడు కూర్చున్నా విందుకు వచ్చిన లోటేం ఉండదు. సో, లోకేశ్ బాబుకు ఏ పోర్టుఫోలియో ఇచ్చినా నో ప్రాబ్లెం.. ఆయన పూనుకుంటే ఇతర శాఖల విషయంలోనూ అడ్డేం ఉంటుందనేది రాజకీయవిమర్శకుల ఉవాచ. మరోవైపు తెలంగాణ సీఎం వారసుడు కేటీఆర్ ఇప్పటికే మంత్రిగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లోకేశ్ వంతు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ జెన్ నెక్స్ట్ రాజకీయాలకు జయహో చెప్పాల్సిందే...

Similar News