రాజధాని రైతులకు ఎంత లాభమో తెలుసా?

Update: 2017-02-02 08:00 GMT

మూల ధన పన్ను నుంచి మినహాయింపునివ్వడంతో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఏపీ రాజధానిని నిర్మిస్తోన్న మొత్తం 29 గ్రామాల్లో 32,221 ఎకరాల భూమిని భూసమీకరణ పద్ధతిలో ప్రభుత్వం సేకరించింది. భూసమీకరణలో దాదాపు 25,614మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రభుత్వం సమీకరించిన భూమిలో దాదాపు 12వేల ఎకరాలను తిరిగి రైతుల కు వాటాగా ఇవ్వనున్నారు. భూ సమీకరణ తర్వాత అమరావతిలో ఎకరం విలువ 3.87కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సగటున గజం విలువ 8వేలకు లెక్కిస్తే ఒక్కో ఎకరా భూమి విలువ సమీకరణ తర్వాత గణనీయంగా పెరిగింది. భూసమీకరణకు ముందు ఈ ప్రాంతంలో భూమి ధర గరిష్టంగా 5 నుంచి 25లక్షల లోపు మాత్రమే ఉండేది. రైతులకు వాటాగా చెల్లించే భూమిలో 50శాతం విక్రయించినా దాని మొత్తం విలువ రూ.23వేల కోట్లకు పైనే ఉంటుంది. మూల ధనపన్ను 20శాతం ఇందులో మినహాయిస్తే రూ.4644 కోట్ల మేర రైతులకు లబ్ది కలుగుతుంది.

పన్ను మినహాయింపు ఎవరికి....?

విభజన తర్వాత ఏపీ మనుగడలోకి వచ్చిన 2014 జూన్‌2 తేదీ నాటికి భూములపై యాజమాన్య హక్కులున్న వారికి జైట్లీ ప్రకటించిన రాయితీ వర్తించనుంది. భూసమీకరణ ద్వారా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన తర్వాత మెట్టభూములకు 1250గజాలు., మాగాణి భూములకు 1450గజాలు రైతుల వాటాగా ఇవ్వనున్నారు. ఇందులో మెట్ట ప్రాంతంలో వెయ్యి గజాల ఇంటి స్థలం., 250 గజాల వాణిజ్య స్థలం., జరీబు భూమిలో వెయ్యి గజాల నివాస స్థలం., 450 గజాల వాణిజ్య స్థలం రైతులకు పరిహారంగా దక్కుతాయి. ఇప్పటికే 20గ్రామాల్లో రైతుల వాటా భూముల పంపకం పూర్తైంది. ఈ ప్రాంతాల్లో తమకు దక్కిన భూముల్ని విక్రయించే విషయంలో 30శాతం మూల ధనపన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జైట్లీ ప్రకటనతో రాజధానికి భూములిచ్చిన రైతులు సంబరాల్లో ఉన్నారు.

తొలిసారి విక్రయానికే....

సిఆర్‌డిఏ ఇచ్చే భూసమీకరణ యాజమాన్య పత్రాల్ని విక్రయించినా., సీఆర్‌డిఏ నుంచి స్థలాలు రైతుల స్వాధీనంలోకి వచ్చిన ఆర్ధిక సంవత్సరం చివరి నుంచి రెండేళ్లలోగా విక్రయించినా పన్ను మినహాయింపు లభిస్తుంది. తొలిసారి చేసే విక్రయాలకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు వర్తించనుంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఒక్కో ఎకరాకు రైతులకు దాదాపు 15 నుంచి 20లక్షల వరకు లబ్ది కలగనుంది. భూములిచ్చిన రైతులు 28వేల మందికి 4300కోట్ల రాయితీ వర్తించనుంది.

Similar News