రామదాసుకు కేసీఆర్ దాసోహం

Update: 2017-02-05 08:15 GMT

ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి మహర్దశ పట్టబోతోంది. భద్రాచలం రామయ్యను కీర్తించిన భక్తరామదాసు జన్మించిన గ్రామాన్ని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. ఈ మేరకు అధికారులు పంపిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇటీవల కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు కంచర్ల గోపన్న జన్మించిన గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆ హామీకి ఇప్పుడు తొలి అడుగు పడింది.

చరిత్ర కల్గిన....

ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి ఉంది. కంచర్ల గోపన్న అక్కడే జన్మించి రామయ్య పరమ భక్తుడిగా మారి భక్తరామదాసుగా మారిపోయారు. ఖమ్మం నుంచి కోదాడకు వెళ్లే రోడ్డులో 15 కిలోమీటర్ల దూరంలో నేలకొండపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామంలో తూర్పు వైపున రాతికొండ ఉండటంతో దీనికి నేలకొండపల్లి అనే పేరొచ్చిందని ఇతిహాసాలు చెబుతాయి. ఈ కొండ నుంచే దేవతా శిల్పాలు, దేవాలయాలకు కావాల్సిన రాళ్లను సేకరిస్తారు. అంతటి పవిత్రమైన కొండగా భావిస్తారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా....

భక్త రామదాసు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదినుంచే ప్రారంభమయ్యాయి. నేలకొండపల్లిలో ఇటీవలే భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని కూడా ప్రభుత్వం నిర్మించింది. ఈ మందిరంలోనే ఉత్సవాలు అధికారికంగా జరిగాయి. ఇన్నాళ్లూ నేలకొండపల్లిని పాలకులు పట్టించుకోలేదు. వందల ఏళ్ల నుంచి ఈ గ్రామానికి ఉన్న చరిత్రను కూడా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నేలకొండపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని నిర్ణయించింది. రామాదాసు జీవిత చరిత్రకు సంబంధించిన గ్రంధాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే మినీ థీమ్ పార్కును కూడా ఇక్కడ నిర్మించనున్నారు. నేలకొండపల్లిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికను రూపొందించారు. మొత్తం మీద నేలకొండపల్లి వాసుల కల ఇన్నాళ్లకు నెరవేరబోతున్నదన్నమాట.

Similar News