విశాఖలో మళ్లీ మంత్రుల రచ్చ రచ్చ

Update: 2017-02-05 01:30 GMT

విశాఖలో ఇద్దరు మంత్రుల జగడం పార్టీకి తలనొప్పిగా మారింది. బదిలీలు, నియామకాల విషయాల్లో ఈ ఇద్దరు మంత్రులూ కొన్నాళ్లుగా....కొన్నేళ్లుగా ఘర్షణ పడుతూనే ఉన్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నారు. అధిష్టానం పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. వారే విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు. వీరిద్దరి మధ్య వైరంతో అదే పార్టీకి చెందిన కార్యకర్తలు నలిగిపోతున్నారు.

విశాఖ ఉత్సవ్ కారణం...

సాగర తీరం సాక్షిగా విశాఖ ఉత్సవ్ ను అంగరంగ వైభవంగా జరుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే విశాఖ ఉత్సవ్ మళ్లీ ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు పెట్టింది. విశాఖ ఉత్సవ్ కు మంత్రి అయ్యన్న పాత్రుడు హాజరు కాలేదు. మంత్రి గంటా మాత్రం విశాఖ ఉత్సవ్ ను అంతా తానై చూసుకుంటున్నారు. దీనిపై మళ్లీ ఇద్దరి మంత్రుల మధ్య ఏదో జరిగిందని విశాఖ టీడీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. విశాఖ ఉత్సవ్ కార్యక్రమాల్లో స్థానికులకు అవకాశం ఇవ్వటం లేదంటున్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. తాను కళాకారుల కోసమే మాట్లాడుతున్నానని... అద్దెకు తెచ్చుకున్న కళాకారులతో విశాఖ ఉత్సవ్ నిర్వహించడాన్ని అయ్యన్న తప్పుపడుతున్నారు. ఉత్సవ్ ప్రారంభోత్సవానికి ఇతర జిల్లాలకు చెందిన మంత్రులను పిలిచారని గంటాపై అయ్యన్న ఆగ్రహంతో ఉన్నారు. గతంలో అనేకసార్లు వీరి మధ్య వివాదం చెలరేగింది. ఒక రెవెన్యూ అధికారి బదిలీ విషయంలో చెరోదారి పట్టడంతో వివాదం రోడ్డుపైకి ఎక్కింది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబబు జోక్యం చేసుకుని వివాదం సద్దు మణిగేలా చేయగలిగారు. పైకి సర్దుకున్నామని చెబుతున్నా అప్పటినుంచే వీరిద్దరూ ఎడమొహం...పెడమొహం...గా తిరుగుతున్నారు. విశాఖ ఉత్సవ్ పై మంత్రి అయ్యన్న చంద్రబాబునాయుడుకు ఫిర్యాదుచేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తం మీద సాగర తీరంలో మంత్రుల మధ్య పెరిగిన వివాదంతో అలజడి రేగింది.

Similar News