సమయం లేదు బాలయ్య బాబూ..?

Update: 2017-02-06 08:30 GMT

రణమా...? శరణమా?.... సమయం లేదు మిత్రమా...? గౌతమి పుత్ర శాతకర్ణిలో బాలయ్య డైలాగ్ లు ఇవి. ఇవే డైలాగ్ లను నిజజీవితంలో ఎమ్మెల్యేగా బాలయ్య బాబు ఎదుర్కొంటున్నారు. బాలకృష్ణ పీఏను పంపించకుంటే రాజీనామాలకు సిద్ధమవుతామంటున్నారు టీడీపీ నేతలు. అంతటితో ఆగకుండా బాలకృష్ణకు వారం రోజులు గడవు ఇచ్చి సమయం లేదు బాలయ్యా? అంటూ హెచ్చరికలు కూడా పంపారు. హిందూపురం నియోజకవర్గంలో ఏ నోట విన్నా ఇప్పుడు ఇవే డైలాగులు. శాతకర్ణి హిందూపురంలో తెగ హల్ చల్ చేస్తున్నాడు.

తిరగ బడ్డ తెలుగు తమ్ముళ్లు....

బాలకృష్ణ పీఏ శేఖర్ ఆగడాలను అరికట్టాల్సిందేనంటూ తెలుగుదేశం నేతలు కొన్ని రోజులుగా మీటింగ్ లు పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే వీరి సమావేశాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో వారు తమ వాయిస్ ను మరింత పెంచేశారు. ఆదివారం బాలయ్య పీఏ శేఖర్ వైఖరికి వ్యతిరేకంగా పెట్టిన సమావేశాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు మరో చోట సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాలకృష్ణకు వారం రోజులు సమయం ఇస్తున్నట్లు చెప్పారు. శేఖర్ ను వెంటనే బాలయ్య బాబు తప్పించాలని కోరుతున్నారు. బాలకృష్ణ, టీడీపీ అంటే తమకు ఎనలేని అభిమానమని వారు చెబుతున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో శేఖర్ చీడపురుగుగా మారాడని విమర్శించారు. తాము వారం రోజుల్లో చిలమత్తూరు లో సభను నిర్వహిస్తున్నామని, అప్పటికీ బాలయ్య శేఖర్ విషయం తేల్చకుంటే పార్టీకి, పదవులకు రాజీనామా చేసేందుకు వెనకాడమని వారు వార్నింగ్ ఇస్తున్నారు.

నోరు విప్పని లెజెండ్...

గత పదిరోజులుగా పీఏ శేఖర్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాట బావుటా ఎగరేస్తుంటే బాలకృష్ణ కనీసం స్పందించడం లేదు. సోషల్ మీడియాలో శేఖర్ ఇచ్చిన వార్నింగ్ క్లిప్పింగ్ హల్ చల్ చేస్తున్నా బాలయ్య బాబు చూసీ చూడనట్లు ఊరుకున్నాడన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇందుకు కారణాలు తెలియకపోయినా...లోకేష్ దీనిపై ఆరా తీస్తున్నారని, లోకేష్ ఇచ్చే నివేదికతోనే బాలయ్య ఓ డెసిషన్ తీసుకుంటారని చెబుతున్నారు.

Similar News