సీఎం కావడం చిన్నమ్మకు అంత...వీజీ...కాదు...

Update: 2017-02-06 06:21 GMT

కాబోయే ముఖ్యమంత్రి శశికళకు కేసుల భయం పట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు చిన్నమ్మ మెడకు చుట్టుకోనుందా? సీఎం పదవికే ఎసరు పెట్టనుందా? మరో వారం రోజుల్లో సుప్రీం కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో శశికళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆమె ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలవుతారు. దీంతో శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన శశికళ ఫేస్ లో ఆ ఆనందం కన్పించడం లేదు. పోయెస్ గార్డెన్ లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపైనే తీవ్రంగా చర్చిస్తున్నారు.

వారం రోజుల్లో తీర్పు...

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత మొదటి ముద్దాయి కాగా, శశికళ రెండో ముద్దాయిగా ఉన్నారు. శశికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ లు తర్వాత ప్లేస్ లోఉన్నారు. 2014లో శశికళకు పదికోట్ల జరిమానా, పదేళ్ల శిక్ష విధిస్తూ బెంగళూరు కోర్టు తీర్పు చెప్పింది. అయితే వీరు ఈ తీర్పుపై బెంగుళూరు హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. దీంతో కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై వారం రోజుల్లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు మెడకు చుట్టుకుంటే మళ్లీ పన్నీర్ కు పగ్గాలు అప్పజెప్పక తప్పేలా లేదు.

శశికళ ఎంపికపై నిరసన...

మరోవైపు శశికళ ముఖ్యమంత్రి కావడాన్ని ఎక్కువ మంది తమిళ ప్రజలు తప్పుపడుతున్నారు. శశికళకు సీఎంగా ఉండే అర్హత లేదంటున్నారు. చిన్నమ్మ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యాక ఛేంజ్ డాట్ ఆర్గనైజేషన్ నిన్న రాత్రి ఆన్ లైన్ లో పోల్ నిర్వహించింది. ఇప్పటికే ఆన్ లైన్ దాదాపు 25000 మంది శశికళకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారట. మరోవైపు ఇటీవల జల్లికట్టు ఉద్యమాన్ని నిర్వహించిన తమిళ యువత కూడా శశికళ ఎన్నికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వీరు శశికళకు వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని నిర్వహించాలని సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టుల కన్పిస్తున్నాయి. మొత్తంమీద చిన్నమ్మ సీఎం పీఠం ఎక్కినా పాలన చేపట్టడం అంత వీజీ కాదు... అని తమిళనాట విన్పిస్తోంది.

Similar News