హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమా?

Update: 2017-01-26 00:30 GMT

సిఏఎస్పీ., సిఈఎపీల ద్వారా రాష్ట్రాలకు ఎంతెంత ఆదాయం సమకూరుతుందో ఇంతకు ముందు చూశాం. సీఈఎపీ ఫార్ములా ప్రకారం రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రావాల్సి ఉంటుంది. చౌహాన్‌ ఫార్ములా ప్రకారం సిఈఏపీలో ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల 90శాతం గ్రాంట్‌ను ఆంధ్రప్రదేశ్ పొందలేకపోతోంది. మిగిలిన రాష్ట్రాల మాదిరే 40శాతం గ్రాంటును ఏపీ భరించాల్సి వస్తోంది. నిజానికి ఈసీఈఏపీ స్కీం ప్రాజెక్టులు ఏటా వచ్చేవి కాదు. కేంద్రంతో కుదుర్చుకున్న అనధికారిక ఒప్పందం ప్రకారం నిధులు రాబట్టాలంటే ఏటా 3వేల నుంచి 5వేల కోట్ల విలువైన పనుల్ని సీఈఏపీ స్కీంలో చేపట్టాల్సి ఉంటుంది. అందుకు బోలెడంత కసరత్తు కూడా చేయాల్సి ఉంటుంది. సీఈఏపీ ద్వారా 2014లో ఏపీలో 640 కోట్లు., 2015లో 900కోట్లు కూడా ఖర్చు చేయలేదు. కానీ ఏటా 3000-5000 కోట్లు ఖర్చు చేస్తే తప్ప రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. అయితే రోడ్ల అనుసంధానం., ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణ., చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు., రాజధాని నిర్మాణం వంటి పనులకు ప్రభుత్వం సుమారు 42వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్రం ద్వారా కొత్తగా ఉపాధి కల్పన కోసం ఎలాంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి దక్కలేదు. భారీ కర్మాగారాలు., పారిశ్రామీకీకరణ జరగాలంటే రాయితీల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.

పన్ను రాయితీలు....

దేశంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు 1968 నుంచి ఉన్నాయి. అయితే వాటికి పన్ను మినహాయింపు అంశం 2002 నుంచి అమల్లోకి వచ్చింది. 8రాష్ట్రాలకు పన్ను రాయితీ 2014తో ముగిసింది. 2017తో మూడు రాష్ట్రాలకు ముగియనుంది. జిఎస్‌టి అమల్లోకి వస్తే కొత్తగా పన్ను రాయితీలు పొందడం అసాధ్యమవుతుంది. విభజన సమయంలో ప్రత్యేక హోదా గురించి రాజ్యసభలో కాస్త చర్చ జరిగినా పన్ను రాయితీల గురించి ఎవరు మాట్లాడలేదు. విభజన చట్టంలో సెక్షన్‌ 98 కింది హామీ ఇచ్చిన ఆర్ధిక ప్రోత్సహకాలలో 15శాతం అదనపు తరుగుదల భత్యం., 15శాతం మూల ధనపెట్టుబడి మాత్రమే ఏపీకి కల్పించారు. సాధారణంగా వాహనాలకు వార్షిక తరుగుదల 30శాతం ఉంటే ఏపీలో కొత్తగా నిర్మించే పరిశ్రమలకు 45శాతం తరుగుదల లెక్కిస్తారు. మూలధన పెట్టుబడిలో 15శాతం రాయితీ అంటే ఎవరైనా 100 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ పెడితే(ప్లాంట్‌., యంత్రాలు., శిక్షణ) అందులో స్థూల లాభం నుంచి 15కోట్లు పన్ను నుంచి మిన‍హాయించవచ్చు. సాధారణ పరిశ్రమలలో ఇది 5శాతం వరకు అదనపు లాభాలనిస్తుంది. ఇక ఆదాయపు పన్ను మినహాయింపు రావాలంటే పరిశ్రమలు లాభాల్లోకి రావాలి., ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు రావాలంటే అక్కడ వస్తు ఉత్పత్తి జరగాలి. సర్వీస్ టాక్స్‌ మినహాయింపుకు సేవల వినియోగం జరగాలి. ఇవేమి జరగడం లేదు కాబట్టి కేంద్రం ఇచ్చే ప్యాకేజీని అంగీకరించామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కేంద్రంతో ఘర్షణపడి బీజేపీ పదవీ కాలం ముగిసిపోతే వచ్చే డబ్బు కూడా రాదనేది చంద్రబాబు చెబుతున్న మాట. ఇందులో వాస్తవాల మాట పక్కన పెడితే పార్లమెంటు సాక్షిగా సమాఖ్య వ్యవస్థలో ఓ కొత్త రాష్ట్రం ఏర్పడితే అది కేంద్రం.,, దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాలన్నట్లు వ్యవహరించడమే సమస్యకు కారణమవుతోంది.

Similar News