Devineni Uma : దేవినేని ఉమకు షాకిచ్చిన చంద్రబాబు.. రీజన్ అదేనా?

మాజీ మంత్రి దేవినేని ఉమకు టీడీపీ అధినేత చంద్రబాబు షాకిచ్చారు. ఆయనకు మూడో జాబితాలోనూ చోటు కల్పించలేదు

Update: 2024-03-22 05:55 GMT

Devineni Uma :మాజీ మంత్రి దేవినేని ఉమకు టీడీపీ అధినేత చంద్రబాబు షాకిచ్చారు. ఆయనకు మూడో జాబితాలోనూ చోటు కల్పించలేదు. దీంతో ఇక దేవినేని ఉమ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తుంది. ఇంకా టీడీపీ ఐదు అసెంబ్లీ స్థానాలను మాత్రమే ప్రకటించాల్సి ఉంది. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు 11 మందితో మూడో జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలోనూ దేవినేని ఉమ పేరు కనిపించలేదు.

పెనమలూరు కూడా...
మైలవరం టిక్కెట్ ను వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ కు కేటాయించారు. అయితే దేవినేని ఉమను పెనమలూరు నియోజకవర్గానికి పంపాలని భావించినా అక్కడ కూడా ఈ జాబితాలో సీటు ఖరారయింది. పెనమలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేరును ప్రకటించడంతో ఇక దేవినేని ఉమకు నియోజకవర్గం అంటూ ఏమీ లేకుండా పోయింది. ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఎక్కడా ఆయన పోటీ చేసేందుకు అవకాశం లేదు.
ఐదుసార్లు గెలిచి...
దేవినేని ఉమ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలోనే ఉన్నారు. టీడీపీకి బలమైన గొంతుకగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ఉమ ఏమాత్రం భయపడకుండా అధికార పార్టీపై పోరాటం చేశారు. అటువంటి దేవినేని ఉమను పక్కన పెట్టడమంటే బలమైన కారణం ఉండి ఉంటుందన్న కామెంట్స్ పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా జిల్లాలో చక్రం తిప్పిన దేవినేని ఉమకు చివరకు ఈసారి సీటు లేకుండా పోయిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News