Ys Jagan : ఆయన రా కదలిరా అంటుంటే... ఈయన కదలడేంది బాబాయ్...?
టీడీపీ అధినేత చంద్రబాబు వరసగా జిల్లాల పర్యటనలు చేస్తుంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం కుర్చీని వదలడం లేదు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఏపీలో ఎన్నికల హీట్ ప్రారంభమయింది. ప్రధాన పార్టీలన్నీ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాల్లో భారీగా మార్పులు చేర్పులు చేపట్టారు. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేశారు. దాదాపు యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. ఇరవై మందికి పైగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు రావని తేలిపోయింది. అయితే జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. ఆయన ఇంకా సమీక్షలతోనే కాలయాపన చేస్తున్నారు. జనంలోకి రావడం లేదు.
జనంలోకి రాకపోవడంతో...
పార్టీ అధినేతగా జగన్ అప్పుడప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేసేందుకు నియోజకవర్గాలకు వస్తున్నారు తప్పించి పూర్తి స్థాయి ప్రచారాన్ని చేపట్టలేదు. ముదు అభ్యర్థులను ఖరారు చేసుకుని ఆయన జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అయితే డిసెంబరులోనే తాను జనం బాట పడతానని గతంలో ప్రకటించిన జగన్ ఇంకా కుర్చీ నుంచి కదలకపోవడంతో క్యాడర్ లో కూడా కొంత నిరాశ కనపడుతుంది. జగన్ జనంలోకి వచ్చి పార్టీని మరింతగా బలోపేతం చేయాలని నేతల నుంచి క్యాడర్ వరకూ కోరుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పట్లో కదిలే అవకాశాలు కనిపించడం లేదు.
క్యాడర్ లో జోష్...
మరోవైపు చంద్రబాబు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రా కదిలిరా పేరిట పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేస్తూ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. తొలి విడత మ్యానిఫేస్టోను రూపొందించిన చంద్రబాబు దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. సూపర్ సిక్స్ పేరిట ఆయన రాజమండ్రి లో జరిగిన మహానాడులో తొలి విడత మ్యానిఫేస్టో విడుదల చేశారు. మహిళలను, యువతను, రైతులతో పాటు సామాజికవర్గాల వారీగా అందరినీ ఆకట్టుకునేలా చంద్రబాబు జనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తులతో పాటు పార్టీలో చేరికలను కూడా ఆయన స్వయంగా చూసుకుంటున్నారు.
ఏడు పదులు దాటినా...
ఏడు పదులు దాటినా చంద్రబాబు హుషారుగా జనంలో తిరుగుతుంటే.. ఐదు పదులు కూడా లేని జగన్ మాత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం కావడంపై వైసీపీ క్యాడర్ పెదవి విరుస్తుంది. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడి వెళుతున్నారని, ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో క్యాడర్ లో అయోమయం నెలకొందని, దీనిని తొలగించేందుకు జనంలోకి జగన్ రావాలని వారు కోరుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం తాను కదిలేది లేదని కుర్చీకి అతుక్కుపోయి కూర్చున్నట్లే కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తర్వాతనే ఆయన జనంలోకి వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి పెద్దాయన పరుగులు తీస్తుంటే... ఈయన మాత్రం ఒంటి మీద బట్ట నలగకుండా కూర్చోవడమేంటన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.