Janasena : జనసైనికులు అనుకున్నది వేరు.. జరుగుతున్నది వేరు.. ఇలాగయితే ఎలాగప్పా?
ఎన్నికలకు ముందు జనసైనికుల అంచనాలు వేరుగా ఉన్నాయి. తమ నాయకుడు శాసించే స్థాయిలో ఉంటారని భావించారు
ఎన్నికలకు ముందు జనసైనికుల అంచనాలు వేరుగా ఉన్నాయి. తమ నాయకుడు శాసించే స్థాయిలో ఉంటారని భావించారు. అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ చూసిన తర్వాత జనసైనికుల్లో ఒకింత నిరుత్సాహం ఏర్పడింది. తాము ఎన్నికలకు ముందు ఊహించుకుంది వేరు.. ప్రస్తుతం జరుగుతున్నది వేరుగా ఉండటంతో ఒకింత నిరాశకు లోనవుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. కనీసం పట్టుబట్టి పదవులు సాధించుకోవాల్సిన సమయంలోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవలంబిస్తున్న ధోరణి వారికి మింగుడుపడకుండా ఉంది. అయితే బయటకు కక్కలేక, మింగలేక అవస్థలుపడుతున్నారు.
ఊహించుకున్నట్లుగా...
కూటమి ఏర్పాటుకు పవన్ కల్యాణ్ కావడంతో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పవన్ కల్యాణ‌్ తో పాటు జనసేనకు కూడా ప్రాధాన్యత ఉంటుందని భావించారు. కేబినెట్ లోనూ మూడు మంత్రి పదవులు ఇవ్వడంతో కొంత తేలిపోయారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల రెండు జాబితాల్లోనూ తమకు అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ లో గాజు గ్లాస్ పార్టీ కార్యకర్తలున్నారు. పార్టీ జెండాను పట్టుకున్న వారికి పదవులు ఇవ్వాల్సిన సమయంలో పవన్ కల్యాణ్ పట్టుబట్టకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏది ఇస్తే అది తీసుకునేందుకు సిద్ధపడటంతో ఒకింత ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఈపరిస్థితిని తాము ఊహించలేదంటున్నారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీలో...
నిజానికి పవన్ కల్యాణ్ పట్టుబడితే మరికొన్ని నామినేటెడ్ పోస్టులు జనసేన నేతలకు దక్కి ఉండేవనభావన వ్యక్తమవుతుంది. జమిలి ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంతో పాటు 2027 ఎన్నికల్లో కలసి పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్న చంద్రబాబు నుంచి వీలయినన్ని పదవులను సంపాదించి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన సమయంలో పవన్ కల్యాణ్ ఇలా వ్యవహరించడమేంటన్న ప్రశ్నలు సహజంగానే కార్యకర్తల్లో వినిపిస్తున్నాయి. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారిని కాదని, వేరే వారికి పదవులు ఇవ్వడం, రాష్ట్ర కార్యాలయంలో టచ్ లో ఉన్నవారికే ఎక్కువ పదవులు కట్టబెట్టడం కూడా జనసైనికుల కోపానికి కారణంగా కనిపిస్తుంది.
ప్రశ్నించిన వారిని...
అయితే అది పెద్ద స్థాయిలో కనిపించకపోయినప్పటికీ పవన్ కల్యాణ్ ను నేరుగా ప్రశ్నించడానికి కూడా వారికి అవకాశం లేదు. ప్రశ్నించిన వారికి సరైన సమాధానం లేకపోగా పక్కన పెడుతుండటం కూడా వారి మౌనానికి కారణంగా తెలుస్తుంది. తమకు అవకాశం ఉన్నప్పుడు పదవులతో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించకుండా కేవలం అధికార పార్టీని కీర్తిస్తూ ఉండటం వల్ల పార్టీ ఎలా బలోపేతం అవుతుందన్న ప్రశ్న కింది స్థాయి క్యాడర్ నుంచి వినిపిస్తుంది. దీంతో జనసైనికులు ఇప్పటికిప్పుడు బయట పడకపోయినా.. పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం ఒకింత అసంతృప్తి .. అసహనం మాత్రం బయలుదేరిందనే చెప్పాలి.