Ys Sharmila : వైఎస్ షర్మిలపై నేతలు గుర్రుమంటున్నారా? సొంత పార్టీ నేతలే రివర్స్ అయ్యారా?

పార్టీ చీఫ్ గా అందరినీ కలుపుకుని పోవాల్సిన వైఎస్ షర్మిల నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు

Update: 2024-11-08 11:25 GMT

ys sharmila

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అందరినీ కలుపుకుని పోలేక పోతున్నారా? ఉన్న నలుగురి నేతలతో ఆమె సఖ్యతగా ఉండలేకపోతున్నారా? అంటే అదే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా అందరినీ కలుపుకుని పోవాల్సిన వైఎస్ షర్మిల నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ ఆ పార్టీ నేతలే ఆరోపిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏదీ పార్టీ నేతలతో మాట్లాడరు. తాను అనుకున్న పని చేస్తారు. తనకు ఇష్టమొచ్చినట్లు ఒక మీడియా సమావేశం పెడతారు. లేదంటే హైదరాబాద్‌కే పరిమితమవుతారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చిన వైఎస్ షర్మిల ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రతిపక్షాన్ని విమర్శించి ఏదో టైమ్ పాస్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై మూడు రోజుల ఆందోళనకు పిలుపు నిచ్చిన వైఎస్ షర్మిల మమ అనిపిస్తున్నారు. ఒక రోజు ధర్నా, మరుసటి రోజు లాంతర్లతో నిరసన అంటున్నారు తప్పించి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు నేతల నుంచి వినిపిస్తున్నాయి.

పార్టీని బలోపేతం చేయాలని...
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ఆలోచనలో మాత్రం ఆమె ఉన్నట్లు కనిపించడం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తను ఏదో ఒక పదవి వస్తుందన్న ఆశతోనే ఆమె పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారనిపిస్తోంది. అంతే తప్ప సీరియస్ గా పాలిటిక్స్ చేయడం లేదన్నది సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్న కామెంట్స్. అసలు వైఎస్ షర్మిల ఏపీలో రాజకీయంగా ఏం చేయాలనుకుంటున్నారో ఆమెకే క్లారిటీ లేదంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో తన సోదరుడు వైఎస్ జగన్ పై విమర్శలు చేసి పార్టీకి నాలుగు సీట్లు తెచ్చిపెట్టాలనుకున్నా ఆ ఆశలు కూడా అడియాసలయ్యాయి. చివరకు షర్మిల కూడా తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
చీఫ్ అయినా...
రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ అయినా... మాములు లీడర్ అయినా ఒకటేనన్నది ఆమెకు ఆలస్యంగా అర్థమయినట్లుంది. ఇక్కడ ఓటు బ్యాంకు జగన్ అందిపుచ్చుకున్నారు. తిరిగి దానిని తెచ్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాని పని. ఇప్పటికే పదిహేనేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అడుగు మోపలేకపోయింది. మరో పదేళ్లు దాని పరిస్థితి అంతే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. పార్టీ హైకమాండ్ కూడా ఏపీపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. అసలు ఏపీ అనేది ఒకటుందన్న విషయాన్ని పార్టీ పెద్దలు మర్చిపోయారు. ఏదో పార్టీ నేతల సంతృప్తి కోసం జాతీయ స్థాయిలో పార్టీ పదవులు కొందరికి ఇచ్చారు తప్పించి ఉపయోగం లేదని వారికి కూడా తెలుసు.
హైకమాండ్ వద్దకు నేతలు...
దీనికి తోడు వైఎస్ షర్మిల తీరు కూడా అలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా జిల్లా నేతలతో సమావేశాలు ఉన్నా అది మామూలుగా మారిపోయింది. వారితో చర్చించడాలు లేవ్. ఒక ప్రెస్ నోట్.. లేకుంటే మరొక మీడియా సమాశం.. అదీ కాదనుకుంటే ఏదో ఒకటి ఫోకస్ అవ్వడానికి రాజకీయంగా ఒక పనిచేయడం పత్రికల్లోనూ, టీవీల్లోనూ కాసేపు కనిపించి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోవడమే సరిపోతుంది. అందుకే ఎన్నికలకు ముందున్న ఆశలు కాంగ్రెస్ నేతల్లో వైఎస్ షర్మిలపై ఇప్పుడు లేవు. సీనియర్ నేతలు కూడా అంటీముట్టనట్లు వ్యవరిస్తున్నారు. త్వరలోనే హైకమాండ్ ను కలసి పీసీసీ చీఫ్ ను మార్చాలంటూ కొందరు ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయని తెలిసింది. మరి కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల సుదీర్ఘకాలం ఉంటుందన్న నమ్మకం అనేది మాత్రం ఆమె సన్నిహితులకే కలగడం లేదు.


Tags:    

Similar News