Kala Venkat Rao : కళా కనిపించడం మానేశారుగా.. రీజన్ అదేనా?
కళా వెంకట్రావు పార్టీలో సీనియర్ నేత. ఆయన గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు
కళా వెంకట్రావు పార్టీలో సీనియర్ నేత. ఆయన గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా కూడా పేరుంది. అయితే కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో స్థానంలో దక్కలేదు. చాలా మంది సీనియర్లకు దక్కనట్లే ఆయనకు కూడా చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కలేదు. ఆయన ఈసారి కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. ఎందుకంటే ఆయనకు చివర వరకూ టిక్కెట్ ఖరారు కాలేదు. లాస్ట్ లిస్ట్ లో ఆయన పేరు కనిపించింది. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో అక్కడ ఆయనకు సీటు దక్కలేదు. చివరి జాబితాలో కళా వెంకట్రావును చీపురుపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు.
బొత్సను ఓడించినా...
అయితే చీపురుపల్లిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించగలిగారు. కొత్త నియోజకవర్గమైనా తాను వెళ్లనని చెప్పలేదు. పార్టీ ఆదేశాల మేరకు ఆయన అక్కడ పోటీ చేశారు. తొలుత చీపురుపల్లిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేత పోటీ చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. కానీ ఆయనకు ఎన్నిసార్లు బుజ్జగించినా గంటా వినిపించుకోలేదు. తాను విశాఖ జిల్లాను వీడి వెళ్లనని భీష్మించుకుని కూర్చుండటంతో చివరి నిమిషంలో అక్కడకు కళా వెంకట్రావును పంపించారు. బొత్స సత్యనారాయణను ఎదుర్కొనాలంటే ఆషామాషీ కాకపోయినా కళా వెంకట్రావు చంద్రబాబు మాట మీరలేదు.
గెలిచినప్పటికీ...
అయితే అనూహ్యంగా కళా వెంకట్రావు గెలిచినప్పటికీ ఆయనకు మంత్రి పదవిలో స్థానం దక్కలేదు. దీనికి కారణాలు మాత్రం బయటకు రాకపోయినా అందరూ సీనియర్ నేతలను పక్కన పెట్టినట్లే కళా వెంకట్రావును కూడా ఈసారి కేబినెట్ లోకి తీసుకోకుండా చంద్రబాబు పక్కన పెట్టారు. సీనియర్ నేత అయినా ఆయన సేవలను పార్టీకి వినియోగించుకుంటారని భావించినా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు. దీంతో ఆయనకు ఇక కీలక పదవి లేనట్లేనని అర్థమవుతుంది. కళా వెంకట్రావు సన్నిహితులు మాత్రం తమ నేతకు కనీసం పదవి ఇవ్వడంలో పార్టీ నాయకత్వం వివక్ష చూపించిందంటూ మండిపడుతున్నారు.
తొలి సారి ఎన్నికైన...
విజయనగరం జిల్లాలో కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన తొలిసారి ఎన్నికైన వ్యక్తి అయినా ఆయనకు మంత్రి పదవి లభించి తనకు దక్కకపోవడం పట్ల కళా వెంకట్రావు కొంత అసంతృప్తితో ఉన్నట్లు కనపడుతుంది. ఎన్నికల ఫలితాల నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పెద్దగా విపక్షం చేసే విమర్శలకు కూడా కౌంటర్ ఇవ్వకుండా కళా వెంకట్రావు మనకు ఎందుకొచ్చిన గోల అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాను చీపురుపల్లి నియోజకవర్గానికే పరిమితమయ్యారు. సొంత నియోజకవర్గం ఎచ్చర్లకు కూడా ఆయన వెళ్లడం లేదని తెలిసింది. కనీసం మీడియాలో కూడా కనిపించడం మానేసిన కళా వెంకట్రావు రాజకీయ భవిష‌్యత్ కు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.