Ys Jagan : జగన్‌లో ఇక మార్పు రాదా? నేతలను కలుపుకుని వెళ్లే తత్వం లేదా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు

Update: 2024-11-08 08:20 GMT

ys jagan

వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు. జగన్ నేతలను కలుపుకుని వెళ్లడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఓటమి తర్వాత కూడా అలాగే ఉన్నారు. జగన్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఆయన ఏదీ నేతలతో పార్టీ విషయాలను ముందుగా పంచుకునే ఉద్దేశ్యం లేనట్లే కనిపిస్తుంది. అసలు వైసీపీకి ఒక పార్టీ కార్యవర్గం ఉందా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఏ పార్టీలోనైనా నాయకుడు పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రాంతీయ పార్టీల్లోనూ పొలిట్ బ్యూరోలు వంటివి ఉంటాయి.

తను అనుకున్నదే...
కానీ వైసీపీలో ఇవేమీ కనిపించవు. ఏకోనారాయణ. జగన్ అనుకున్నది అనుకున్నట్లే జరగాల్సింది. జగన్ రెండు విషయాలను ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలను అమలు పర్చి మరొకసారి తాను ఇంతేనని నిరూపించుకున్నారు. పార్టీలో ఇది చర్చనీయాంశంగా మారింది. తలపండిన సీనియర్ నేతలు ఎందరో వైసీపీలో ఉన్నారు. రాజకీయాల్లో డక్కామొక్కీలు తిన్న నేతలు కూడా ఉన్నారు. వారందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకునే సంప్రదాయం మాత్రం ఫ్యాన్ పార్టీలో లేదు. అదే అనేక మంది నేతలకు రాజకీయంగా ఇబ్బందిగా మారింది. పార్టీలో ఉండకపోవడానికి కూడా అదే ప్రధాన కారణంగా చూపుతున్నారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం జగన్ ఇంకా మానుకోవడం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి...
తాజాగా జగన్ తీసుకున్న రెండు నిర్ణయాలు ఆయనలోని ఏకపక్ష వ్యవహారశైలికి అద్దం పట్టాయి. 1. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం. 2. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. ఎందుకు బహిష్కరించిందంటే తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసిందని చెప్పి తప్పుకుంది. కానీ గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే టీడీపీకి ఊపిరి వచ్చిందన్న విషయాన్ని వైసీీపీ అధినేత మర్చిపోయినట్లున్నారు. ఎన్నికకు జగన్ సిద్ధంగా లేరన్న సంకేతాలు ఈ నిర్ణయంతో ఇచ్చినట్లయింది.
అసెంబ్లీ సమావేశాలకు...
ఇక మరో నిర్ణయం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం. పదకొండు మంది సభ్యులున్నప్పటీకీ వారితో మాట్లాడి, చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2024 శాసనసభ ఎన్నికల్లో పదకొండు మంది మాత్రమే గెలిచారు. అయినా గెలిచిన వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. వారితో ఏమాత్రం సంప్రదించకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి తాము అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నామని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలలో కూడా ఈ నిర్ణయం కొంత అసంతృప్తికి దారి తీసేలా ఉంది. కానీ జగన్ మాత్రం అధికారంలో ఉన్న తరహాలోనే వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Tags:    

Similar News