Ys Sharmila : వైఎస్ షర్మిలా రెడ్డి ఇక్కడ... ప్రతి మాటకు కౌంట్ అక్కడ
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో పర్యటించి వచ్చారు. పార్టీ సమావేశాలను నిర్వహించారు
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో పర్యటించి వచ్చారు. పార్టీ సమావేశాలను నిర్వహించారు. వైఎస్సార్ ను పదే పదే తలచుకున్నారు. వైఎస్ కు అత్యంత ఆప్తులయిన వారితో భేటీ అయ్యారు. ఇది జగన్ కు కొంత ఇబ్బంది కలిగించే పరిణామంగానే చూడాలి. వైఎస్ కు అత్యంత సన్నిహితులైన వారిని కలిసి తనకు తన అన్న చేసిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తనను రాజకీయంగా ఆశీర్వదించాలని కూడా షర్మిల కోరుతున్నారు. కేవలం వైఎస్ సన్నిహితులను మాత్రమే కాకుండా జగన్ జట్టులో ఉన్న వారిని కూడా కలసి తనకు మద్దతు ఇవ్వాలని, వీలయితే తాను చీఫ్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుతున్నారు.
పార్టీని బలోపేతం చేసేందుకు..
రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఉండవల్లి ఆశీస్సులను పొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును జగన్ పూర్తి చేయకపోవడంపై కూడా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నట్లు తెలిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలను పక్కన పెట్టి జగన్ తన సొంత అజెండాను అమలు చేస్తున్నారని, వైఎస్ ను ఏపీ ప్రజలు మరిచిపోయే ప్రయత్నాలు జగన్ చర్యల్లో కనపడుతున్నాయని వైఎస్ షర్మిల చెప్పారట. అలాగే గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేత, వైఎస్ కు అత్యంత సన్నిహితుడు దుట్టా రామచంద్రరావును కూడా కలిశారు. ఆయనను పార్టీలో చేరాలని ఆహ్వానించారు.
సన్నిహితులను కలిసి...
అన్ని జిల్లాల్లో వైఎస్ కు అత్యంత సన్నిహితులను కలవడం వాళ్లతో జగన్ తనతో పాటు ఆయన నమ్ముకున్న నేతలకు అన్యాయం చేసిన వైనాన్ని కూడా షర్మిల చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మాటకు మాట గట్టిగానే షర్మిల జవాబు చెబుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ఱ్రచారం వెనక కూడా జగన్ ఉన్నారని, సొంత చెల్లెలని చూడకుండా ఇలా తనపై మాటల దాడి చేయడమేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఏపీలో పాలన పూర్తిగా గాడి తప్పిందంటున్న షర్మిల ప్రత్యేక హోదాను పక్కన పెట్టి మరీ.. బీజేపీకి అనుకూలంగా మారి రాష్ట్ర ప్రయోజనాలను జగన్ దెబ్బతీస్తున్నారంటూ వైసీపీ అధినేతపై మండిపడుతున్నారు.
తన తల్లిని కూడా...
దీంతో పాటు తాను జగన్ నుంచి ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించలేదని, అందుకు తన తల్లి విజయమ్యే సాక్షి అంటూ ఆమెను రింగ్ లోకి లాగారు. జనంలో జగన్ ను పలుచన చేసే ప్రయత్నంలోనే వైఎస్ షర్మిల ఉన్నారని అర్థమవుతుంది. అయితే వైఎస్ షర్మిల ఉన్నది కాంగ్రెస్ లో. ఆ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంకు లేదు. షర్మిల కారణంగా ఓట్లు వచ్చి పడతాయా? లేదా? అన్నది పక్కన పెడితే జగన్ కు మాత్రం రాజకీయంగా నష్టం జరుగుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి. వైఎస్ షర్మిలను రెచ్చగొట్టేకొద్దీ రెచ్చిపోతారని తెలిసీ వైసీపీ శ్రేణులు కూడా ఆమెను కదలించడం కొరివితో తలగోక్కున్నట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. షర్మిల మానాన షర్మిలను వదిలిపెడితే హుందాగా ఉంటుందని కూడా సూచిస్తున్నారు.