Telangana : రీ ఎంట్రీకి రెడీ అవుతున్న తెలుగుదేశం పార్టీ
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయింది.;

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ తెలంగాణలోనూ తన గత వైభవాన్ని చాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. నేతలు సిద్ధంగా ఉండాలని, త్వరలోనే తెలంగాణ నేతలతో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేస్తానని, ఆ సమావేశంలో పార్టీ బలోపేతం చేయడంపై తగిన సూచనలు చేయనున్నట్లు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కావడంతో తెలంగాణలోనూ తన ప్రాముఖ్యతను నిలబెట్టుకోవాలని భావిస్తుంది.
కొంత సమయాన్ని...
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పైనే ఫోకస్ పెట్టింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి కూటమిగా తెలంగాణలో పోటీ చేసినప్పటికీ అనుకున్న విజయాలు సాధించలేకపోయింది. ఖమ్మం జిల్లాలో మత్రమే కొన్నిసీట్లు సాధించడం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఈసారి యువతరానికి సీట్లు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడమేకాకుండా తగిన ప్రాధాన్యత ఇస్తామన్న హామీతో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కార్యాచరణ పథకాన్ని రూపొందించాలని ఇప్పటికే సీనియర్ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
వీడిన నేతలను...
తెలంగాణలో నేతలు పార్టీని వీడినా క్యాడర్ ఉందని పార్టీ నాయకత్వం బలంగా నమ్ముతుంది. దీంతో పాటు బలమైన ఓటు బ్యాంకు కూడా ఉందని భావిస్తుంది. హైదరాబాద్ నగరంతో పాటు ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కూడా ఓటు బ్యాంకు ఉందని గుర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముఖ్యమైన నియోజకవర్గాలను గుర్తించి అందులోనే పోటీ చేసి అక్కడ గెలిచి కనీస స్థానాల్లో పసుపు జెండా ఎగరేలా చూడాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. దీంతో పాటు గతంలో పార్టీని వీడిపోయిన నేతలను తిరిగి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సీనియర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో...
మరొకవైపు అసెంబ్లీ ఎన్నిలకు ఇంకా సమయం ఉన్నందున ముందుగా వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని దాదాపుగా టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఒంటరిగా పోటీ చేయకుండా ఏపీ తరహాలోనే తెలంగాణాలోనూ బీజేపీ, జనసేనతో కలసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించాలన్న ఉద్దేశ్యంతో అధినేత ఉన్నారు. తక్కువ స్థానాల్లో పోటీ చేసినా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ ఉండేలా చూసుకోగలిగితే పార్టీ ఇమేజ్ మళ్లీ పెరిగి ఓటర్లు తిరిగి పార్టీ వైపు చూస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో ఆ దిశగానే ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలిసింది. ఎటూ బీజేపీ కిఉన్నబలంతో టీడీపీ, జనసేన ఓటు బ్యాంకు కలిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతుంది. సో.. త్వరలోనే టీడీపీతెలంగాణలో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.