ఇడ్లీ అమ్మకు ఇల్లు కట్టించిన బిజినెస్ టైకూన్.. నెటిజన్ల సెల్యూట్!!
ఆమెకు మంచి ఇల్లు కట్టి, కానుకగా ఇస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్రా.
తమిళనాడు : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా.. మరోసారి నెటిజన్ల ప్రశంసలు అందుకున్నారు. ఆయన ఏం చేసినా అది వైరల్ అవ్వాల్సిందే. తమిళనాడు రాష్ట్రంలోని పెరూ కు సమీపంలో గల వడివేళంపాలయం గ్రామంలో ఉంటున్న "ఇడ్లీ అమ్మ" గురించి వినే ఉంటారు. అన్ని నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగినా.. కమలతల్, ఇడ్లీ అమ్మగా పిలువబడే ఆ బామ్మ 37 ఏళ్లుగా రూపాయికే ఇడ్లీ విత్ చట్నీ, సాంబార్ ను అమ్ముతూ.. జీవనం సాగిస్తోంది. ప్రతి రోజూ ఆమె 1000 ఇడ్లీలు వేసి, ఆకలితో ఉన్నవారి కడుపును నింపుతోంది. కానీ.. ఆమె ఉండేందుకు సరైన ఇల్లు లేదని 2021 ఏప్రిల్ లో ఒక నెటిజన్ వీడియో పోస్ట్ చేశాడు.
అది చూసిన ఆనంద్ మహీంద్రా దానిని రీట్వీట్ చేస్తూ.. ఆమెకు మంచి ఇల్లు కట్టి, కానుకగా ఇస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్రా. మే 8వ తేదీ మదర్స్ డే సందర్భంగా.. "ఇడ్లీ అమ్మ"కు కొత్త ఇంటిని బహుకరించారు. ఆనంద్ మహీంద్రా టీమ్ "ఇడ్లీ అమ్మ" తో గృహ ప్రవేశం చేయించారు. ఇకపై ఎండలో, వానలో "ఇడ్లీ అమ్మ" కష్టపడనక్కర్లేదని, ఆమెకు సౌకర్యంగా ఉండేలా ఆ ఇంట్లో ప్రత్యేకంగా వంటగదిని నిర్మించినట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ మంచిపనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.