ముప్పు ముంగిట వైద్యులు

ఎంతో గ్లామర్ ఉంటుంది అనుకున్న వైద్య వృత్తి నేడు ఒత్తిడిలో చిత్తవుతోంది. ప్రాణాలు కాపాడే డాక్టర్లు శారీరక, మానసిక సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు.

Update: 2023-06-16 05:59 GMT

                                            సుదీర్ఘమైన చదువు... తట్టుకోలేనంత పోటీ

     

సమాజంలో గౌరవం, గ్లామర్‌.. రెండు చేతులా సంపాదన... రాజకీయాల్లో కూడా చక్రం తిప్పగల సత్తా. ఇదీ మన దేశంలో డాక్టర్ల మీద ఉండే అభిప్రాయం. ఇదంతా నాణానికి ఒకవైపు. ఎంబీబీఎస్‌ కోర్సులో చేరడానికే తీవ్ర పోటీ. పీజీలో చేరడానికి మరింత ఒత్తిడి. ప్రాణాలు పెట్టి చదివితే కానీ దక్కని సూపర్‌ స్పెషాలిటీ సీటు. ఇది నాణానికి మరోవైపు. మనదేశంలో లక్షా ఏడు వేల ఎంబీబీఎస్‌ సీట్లు, నలభై ఐదువేల పీజీ సీట్లు, 2500 సూపర్‌ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. అంటే చదువులో ఉన్నత స్థానానికి వెళ్లే కొద్దీ పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. ఇక ఎలాంటి విద్యా సంవత్సరాలు నష్టపోకుండా చదివితే, పన్నెండేళ్ల తర్వాత వైద్య వృత్తిలోకి ప్రవేశిస్తారు. వంశపారంపర్యంగా వైద్యాన్ని వృత్తిగా తీసుకున్న వాళ్లు పర్వాలేదు కానీ, కుటుంబంలో మొదటి సారి డాక్టర్‌ అయిన వ్యక్తికి గుర్తింపు రావడానికి మరో రెండు, మూడేళ్లు పడుతుంది. లక్షలు వస్తాయని కార్పొరేట్‌ హాస్పిటల్లో చేరితే, టార్గెట్లు పూర్తి చేయాలి. దీనికోసం డాక్టర్ల మీద మరింత ఒత్తిడి. మోస్ట్‌ గ్లామరస్‌గా విద్యార్థులు, తల్లిదండ్రుల భావించే వైద్య వృత్తిలో ఇది మరో కోణం.

2016లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం యాభై శాతం మంది వైద్యులకు గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదంలో ఉన్నారట. చాలామంది డాక్టర్లు నలభై ఏళ్లకే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. గత ఏడేళ్లలో ఈ లెక్కలు మరింత పెరిగి ఉంటాయి. ఈ సందర్భంగా ఈ మధ్యనే మరణించిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ గౌరవ్‌ గాంధీని గుర్తు చేసుకోవాలి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన డాక్టర్‌ గాంధీ వయసు 41 సంవత్సరాలు. ఆయన కొన్ని వందల శస్త్ర చికిత్సలను చేసి, ఎంతో మందికి ఆయుష్షు పోశారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్స నిపుణుడు తన హృదయాన్ని మాత్రం పదిలంగా కాపాడుకోలేకపోయారు.


‘నా కంటే తక్కువ మార్కులు వచ్చిన నా ఫ్రెండ్స్‌ ఇంజినీరింగ్‌ చదివి నాలుగేళ్లలో సెటిల్‌ అయిపోయారు. ఇప్పుడు నాకంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నారు. నేను మొండితనంతో ఇందులోకి వచ్చాను. ఇప్పటికీ స్ట్రగుల్‌ అవుతున్నాను’ అన్నారు హైదరాబాద్‌కు చెందిన ఓ సర్జికల్‌ అంకాలజిస్ట్‌.

‘మెడిసిన్‌ని కెరీర్‌ ఆప్షన్‌గా ఎంచుకోవడం అంటే టైమ్‌ టేకింగ్‌, పెయిన్‌ టేకింగ్‌. నేనైతే మెడిసిన్‌ చదవమని ఎవరికీ రికమెండ్ చేయను’ అంటున్నారు తిరుపతి స్విమ్స్‌లో పనిచేస్తున్న ఓ న్యూరాలజిస్ట్‌. చాలామంది డాక్టర్లు చిన్న వయసులోనే బీపీ, డయాబెటిక్‌ బారిన పడుతుండటం గమనార్హం. సరైన భోజన వేళలు పాటించకపోవడం, శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా వారిని అనారోగ్యం వైపు నడిపిస్తున్నాయి. ప్రాణాలు కాపాడే వైద్యులే మానసిక, శారీరక సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండటం విషాదకరం. 

Tags:    

Similar News