Pawan Kalyan : పవన్ మింగుడు పడటం లేదా? కట్ చేయలేరుగా?
రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఎలా జరిగినా గత ఎన్నికల్లో మాత్రం గ్రాండ్ వెల్ కమ్ జరిగిందనే చెప్పాాలి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఎలా జరిగినా గత ఎన్నికల్లో మాత్రం గ్రాండ్ వెల్ కమ్ జరిగిందనే చెప్పాాలి. జనసేన పార్టీ వంద శాత స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ గెలిచింది. అయితే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాలనుకుంటున్నారు. తన,మన అనేది లేకుండా అవినీతికి తావివ్వని పాలన అందివ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. ప్రత్యర్థులను ఒకవైపు కట్టడి చేస్తూనే కూటమి పార్టీలలో జరుగుతున్న తీరును కూడా ఎండగట్టేందుకు ఆయన ఏమాత్రం వెనకాడటం లేదు. కానీ పవన్ కల్యాణ్ చర్యలు కొందరు కూటమి నేతలకే రుచించడం లేదు. ప్రధానంగా టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ ఇలా వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏంటన్న భావనకు వచ్చారు.
మౌనం వీడిన తర్వాత…
పవన్ కల్యాణ్ మొన్నటి వరకూ మౌనంగానే ఉన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, అటవీ శాఖలను ఏరి కోరి తీసుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ శాఖలపై అథ్యయనం చేసిన తర్వాత రంగంలోకి దిగారు. తిరుపతిలో సనాతన ధర్మం అంటూ సభను ఏర్పాటు చేసి ఒకింత బీజేపీతో పాటు టీడీపీకి కూడా తన ఆలోచనలను చెప్పకనే చెప్పారు. తర్వాత కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి హోం శాఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోంశాఖను తాను తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హోం శాఖ సరిగా పనిచేయడం లేదని ఆయనే విమర్శలు చేసి సొంత కూటమి ప్రభుత్వాన్నేఇరుకున పెట్టారు. అది ఏ ఉద్దేశ్యంతో చేసినా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని డ్యామేజి చేశాయి. అయినా చంద్రబాబు పవన్ కల్యాణ్ ను పిలిపించుకుని మాట్లాడారు. శాంతిభద్రతల సమస్యను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు వరసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా మిత్రపక్షాలయిన వారికి కొంత ఇబ్బంది పెట్టినా పవన్ చేసిన పనికి ప్రత్యర్థులపై కేసులు నమోదవుతున్నాయని అని కొందరు సంతృప్తి చెందారు.
రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై…
తాజాగా కాకినాడ పోర్టుకు వెళ్లి హడావిడి చేసిన పవన్ కల్యాణ్ అక్కడ ఇంకా రేషన్ బియ్యం విదేశాలకు స్మగ్లింగ్ అవుతున్న విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియపర్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుంది. పోలీసులు, అధికారులు కూటమి ప్రభుత్వం చెప్పినట్లు వినేవారే. కాేనీ పవన్ చేసిన హడావిడికి అది రివర్స్ లో ప్రభుత్వానికే డ్యామేజీ అయింది. రేషన్ బియ్యం పెద్దయెత్తున తరలిపోతున్నాయంటూ చేసిన కామెంట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. రేషన్ మాఫియాను అరికడతామని ఆయన చెప్పినప్పటికీ ఇది ప్రభుత్వ వైఫల్యమేనని అందరూ అనుకోవాల్సి ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని అంబటి రాంబాబు వంటి వారు పయ్యావుల కేశవ్ వియ్యంకుడే మాఫియాకు మార్గదర్శి అని అనడం కూడా మరింత రచ్చగా మారింది. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని పవన్ కోరారని తెలిసింది. అధికారపార్టీలో కొన్ని తెలిసి చూసీ చూడనట్లు వెళ్లాలి. మరికొన్ని విషయాల్లో పట్టుబట్టాలి.
పవన్ కామెంట్స్ తో…
కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన, మన లేకుండా ఫైర్ అవుతుండటంతో కూటమి ప్రభుత్వానికే ఇబ్బందిగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు పవన్ కల్యాణ్ బీజేపీ డైరెక్షన్ లో చేస్తున్నారా? అన్న అనుమానాలు కూడా కొందరిలో వ్యక్తమవుతున్నాయి. టీడీపీని బద్నాం చేయడానికి ఈ రకమైన ప్రయత్నాలు పవన్ చేస్తున్నారా? అన్న సందేహాలు కూడా తెలుగు తమ్ముళ్లు ఆఫ్ ది రికార్డులో అంటున్నట్లు తెలిసింది. కానీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే పవన్ అవసరం కావాల్సి ఉండటంతో చంద్రబాబు కూడా ఉగ్గబట్టి పవన్ ను మెప్పించే ప్రయత్నమే చేస్తున్నారని అంటున్నారు. పవన్ కల్యాణ్ ను ఏమీ అనలేక, చంద్రబాబు తిరిగి టీడీపీ నేతలపై ఫైర్ అవుతూ తన ఫ్రష్టేషన్ ను తీర్చుకుంటున్నారని, పవన్ కల్యాణ్ ఇలా ఒక వే లేకుండా వెళుతుంటే, రాజకీయవ్యూహాలు లేకుండా అడుగులు వేస్తుంటే, మిత్ర పక్షాల ప్రయోజనాలు మర్చి అరుస్తుంటే మాత్రం డ్యామేజీ అయ్యేది మాత్రం కూటమి ప్రభుత్వమేనన్న వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది.