Andhra Pradesh : ఆరునెలల్లో అమలు చేసింది.. గ్యాస్ మాత్రమేనా?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావచ్చింది. అయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో మాత్రం ప్రభుత్వం పెద్దగా ఫోకస్ పెట్టలేదు

Update: 2024-12-09 06:05 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావచ్చింది. అయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో మాత్రం ప్రభుత్వం పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను నాలుగువేల రూపాయలకు పెంచుతూ దానిని పంపిణీ చేస్తున్నారు. తర్వాత మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం ప్రారంభించారు. అదీ నవంబరు నెలలోనే. అంతే తప్ప ఆరు నెలల్లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పెద్దగా దృష్టిపెట్టలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆరు నెలలు అంటే ఒక ప్రభుత్వానికి చిన్న సమయమే కావచ్చు. కానీ ప్రజలకు మాత్రం అది ఎక్కువ సమయమే అవుతుంది.

గత ప్రభుత్వంతో పోల్చుకుంటే...
ఎందుకంటే గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి బేరీజు వేసుకుంటారు. ఆ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల్లో జనం ఇస్తున్నది అత్తెసరు మార్కులేనని చెప్పాలి. మద్యం దుకాణాలను ప్రయివేటు పరం చేయడంతో పాటు అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చి మందుబాబులకు కొంత ఊరట కలిగించారు. ఉచిత ఇసుక విధానం అమలు చేసింది. అలాగే అన్న క్యాంటిన్లను అందుబాటులోకి తెచ్చి పేదల కడుపు నింపే ప్రయత్నంలో కొంత సక్సెస్ అయ్యారు. అయితే ఆరు నెలల నుంచి గత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు తప్పించి తాము అమలు చేయాల్సిన హామీల గురించి మాత్రం మాట్లాడటం లేదు. నెలకు ఆడబిడ్డకు పదిహేను వందల రూపాయలు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం, రైతు కు పెట్టుబడి సాయం, విద్యార్థులకు వసతి దీవెన వంటివి మాత్రం అమలు చేయలేదు.
క్యాలెండర్ ఏదీ?
గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఒక క్యాలెండర్ ను రూపొందించుకుని దాని ప్రకారం ఖచ్చితంగా ఆ డేట్ కు మాత్రం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేవారు. వివిధ పథకాల కింద లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు లబ్ది పొందిన ఇల్లు ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ఆరు నెలల నుంచి నగదును జమ చేయడం లేదు. కేవలం పింఛను మొత్తాన్ని నేరుగా లబ్దిదారులకు అందచేస్తున్నారు. అలాగే మొన్నఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి సొమ్మును జమ చేశారు. అంతే తప్ప మరే పథకం గ్రౌండ్ చేయలేదు. దీనికి ప్రధాన కారణం..ఖజానా ఖాళీ అని చెబుతున్నారు. గత ప్రభుత్వం చేసినఅప్పులకు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని పదే పదే చెబుతున్నారు.
ప్రజలకు కావాల్సింది...
కానీ ప్రజలు గత ప్రభుత్వం చేసిన అప్పులను పట్టించుకోరు.ఇప్పుడు ఏం చేశారన్నదే వారికి కావాల్సింది. ఇక వాలంటీర్లకు పదివేల రూపాయల నెల వేతనం ఇస్తామని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదు. కనీసం సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు పరుస్తామన్న తేదీలను కూడా ప్రభుత్వం చెప్పలేనిపరిస్థితుల్లో ఉంది. ఒకవైపు డబ్బులు లేవంటూనే మరొక వైపు రాజధాని అమరాతి నిర్మాణం కోసం పెద్దయెత్తున నిధులను వెచ్చించడం, మెట్రో రైలు వంటి ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం వంటివి కూడా విమర్శలకు కారణమయ్యాయి.ఇది పేదల ప్రభుత్వం కాదన్న అభిప్రాయం నెలకొల్పేలా కూటమి ప్రభుత్వం అడుగులు పడుతున్నాయని చెప్పకతప్పదు. ఇప్పటికైనా సంక్షేమ పథకాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టకపోతే ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశముంటుందని విశ్లేషకులు సయితం హెచ్చరిస్తున్నారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News