శ్రీలంకతో అంత సులువు కాదు
టీం ఇండియా మరో కీలకమైన ఆటకు సిద్ధమయింది. ఆసియా కప్ లో నేడు మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది.
టీం ఇండియా మరో కీలకమైన ఆటకు సిద్ధమయింది. ఆసియా కప్ లో నేడు మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. నిన్న పాకిస్థాన్ పై సూపర్ విక్టరీ కొట్టిన రోహిత్ సేన మరికాసేపట్లో శ్రీలంక జట్టుతో తలపడనుంది. వరసగా మ్యాచ్ లు ఆడుతుండటంతో టీం ఇండియా జట్టులో కొంత అలసట కనిపిస్తున్నా పాక్ పై విజయంతో రెట్టించిన ఉత్సాహంతో భారత ఆటగాళ్లు మైదానంలోకి దిగుతున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా భారత జట్టు పటిష్టంగా ఉంది. బ్యాటర్లు, బౌలర్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు.
పాకిస్థాన్ జట్టుపై...
పాకిస్థాన్ జట్టుపై రికార్డు స్థాయి విజయంతో ఊపు మీదున్న టీం ఇండియా శ్రీలంకను అంత ఆషామాషీగా తీసుకోవడానికి వీలులేదు. అదే కొలోంబోలో ఈ మ్యాచ్ కూడా జరగనుంది. అయితే శ్రీలంక టీంకు ఇది హోం పిచ్ కావడంతో గెలుపుపై ధీమాగా ఉంది. సూపర్ 4లోకి ప్రవేశించిన జట్లు అన్నీ బలంగానే కనిపిస్తున్నాయి.
వర్షం కురిసే...
అయితే శ్రీలంకతో జరిగే జట్టులో కొన్ని మార్పులు, చేర్పులు చేపట్టాలని భావిస్తున్నారు. కొందరి ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. శ్రేయస్ అయ్యర్ తో పాటు మహ్మద్ షమీకి ఈ గేమ్ లో చోటు కల్పించే అవకాశాలున్నాయని తెలిసింది. అయితే రెండు జట్లు బలంగా ఉండటం, ఎవరి ప్లస్ పాయింట్లు వారికి ఉండటంతో గెలుపోటములు నిర్ణయించడం కష్టమే. నిన్న పాక్ మ్యాచ్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్ కు నేడు జరగనున్న మ్యాచ్ కూడా మంచి ఫీస్ట్ అని చెప్పాలి. అయితే వర్షం పడే సూచనలు ఉండటంతో మ్యాచ్ జరగడంపైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.