IPL 2025 : పంతూ.. ఇదేందేయ్యా సామీ.. ఇంత క్రేజ్ ఏంటి?
ఐపీఎల్ మెగా వేలం ఈరోజు జరిగింది. అయితే గతంలో ఉన్న రికార్డులను అధిగమిస్తూ రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు
ఐపీఎల్ మెగా వేలం ఈరోజు జరిగింది. అయితే గతంలో ఉన్న రికార్డులను అధిగమిస్తూ రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. లక్నో ఫ్రాంచైజ్ రిషబ్ పంత్ ను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. నిజానికి రిషబ్ పంత్ గతంలో జరిగిన యాక్సిడెంట్ నుంచి కోలుకోవడం కష్టమేనని భావించారు. తన తల్లిని కొత్త ఏడాది చూసేందుకు, విషెస్ చెప్పేందుకు ఆయన కారులో బయలుదేరి వెళుతూ యాక్సిడెంట్ కు గురయ్యారు. కారు ప్రమాదానికి గురైన తీరును చూసిన వారు ఎవరూ రిషబ్ పంత్ మళ్లీ క్రికెట్ ఆడతారని అనుకోలేదు. కానీ అత్యంత వేగంగా ఆత్మవిశ్వాసంతో గాయాల బారి నుంచి బయటపడి కోలుకుని తిరిగి మైదానంలోకి అడుగు పెట్టాడు.
ప్రమాదం నుంచి కోలుకుని...
అంతర్జాతీయ క్రికెట్ లో కూడా మళ్లీ చోటు సంపాదించుకున్న రిషబ్ పంత్ అత్యంత వేగంగా వికెట్ల వెనక కదలుతూ వికెట్ కీపర్ గా మాత్రమే కాకుండా బ్యాటింగ్ లోనూ తన దైన శైలిలో ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. అలాంటి రిషబ్ పంత్ 2024లో ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే రిషబ్ పంత్ ను ఆ టీం మేనేజ్ మెంట్ పక్కన పెట్టింది. అయితే రిషబ్ పంత్ ను కొనుగోలు చేయడానికి లక్నో జట్టు ముందుకు రావడమే కాకుండా అత్యధిక ధరకు కొనుగోలు చేయడం ఇప్పుడు మెగా ఐపీఎల్ వేలంలో హాట్ టాపిక్ గా మారింది. మంచి ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ కోసం లక్నో టీం మేనేజ్ మెంట్ అంత మొత్తాన్ని వెచ్చించడంతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
శ్రేయస్ అయ్యర్ కూడా...
మరోవైపు పంజాబ్ కింగ్స్ టీం కెప్టెన్ మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ను కూడా భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్ టీం శ్రేయస్ అయ్యర్ ను 26.75 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ కోసం కోల్ కత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మేనేజ్ మెంట్లు వేలంలో పోటీ పడ్డాయి. వేలం 7.5 కోట్ల రూపాయలు దాటిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ పోటీలోకి వచ్చింది. రెండు జట్లు పోటీ పడి మరీ వేలంలో శ్రేయస్ అయ్యర్ కోసం ప్రయత్నించాయి. చివరకు పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ ను 26.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో పంత్, శ్రేయస్ అయ్యర్ లు అత్యధిక ధరకు అమ్ముడు పోయి గత ఐపీఎల్ వేలం రికార్డులను అధిగమించినట్లయింది. 2024 ఐపీఎల్ వేలంలో రూ.24.75 కోట్ల ధర పలికిన స్టార్క్ ఈసారి 11.75 కోట్లకు మాత్రమే అమ్ముడు పోవడం విశేషం.