ఆస్ట్రేలియా మీద అద్భుతమైన విజయాన్ని అందుకున్న విండీస్

పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టును

Update: 2024-01-28 10:36 GMT

పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టును విండీస్ ఓడించింది. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ క్రెయిగ్ బ్రాత్ వైట్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు 8 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించింది. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై 21 ఏళ్ల తర్వాత విండీస్ సాధించిన తొలి విజయం ఇది. విండీస్ బౌలర్ షామార్ జోసెఫ్ రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. షామార్ కు కెరీర్ లో రెండో టెస్టు ఇది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో విండీస్ కు సంచలన విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనూ షామార్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో సత్తా చాటాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బిస్బేన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో విండీస్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించి, 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను గెలిపించేందుకు ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌ (91 నాటౌట్‌) ఆఖరి వరకు ప్రయత్నించాడు. అయితే షమార్‌ జోసఫ్‌ (7/68) విజృంభించడంతో ఆసీస్‌కు పరాభవం​ తప్పలేదు. 1997 తర్వాత ఆసీస్‌ను వారి సొంత దేశంలో ఓడించడం విండీస్‌కు ఇది మొదటిసారి.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చేసిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కవెమ్‌ హాడ్జ్‌ (71), జాషువ డసిల్వ (79), కెవిన్‌ సింక్లెయిర్‌ (50) అర్ధసెంచరీలతో సత్తా చాటారు. స్టార్క్‌ నాలుగు, హాజిల్‌వుడ్‌, కమిన్స్‌ తలో రెండు, నాథన్‌ లయోన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.ఉస్మాన్‌ ఖ్వాజా (75), అలెక్స్‌ క్యారీ (65), కమిన్స్‌ (64 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 4, కీమర్‌ రోచ్‌ 3, షమార్‌ జోసఫ్‌, కెవిన్‌ సింక్లెయిర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ షమార్‌ ధాటికి ఆసీస్‌ 207 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.


Tags:    

Similar News