బెడిసికొట్టిన గుజరాత్ ప్లాన్.. 10వ సారి ఐపీఎల్ ఫైనల్స్ కు చెన్నై
చెన్నై జట్టును ఓపెనర్లు ఆదుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే 87 పరుగులు చేశారు. గైక్వాడ్ 44 బంతుల్లో 7 ఫోర్లు..
ఐపీఎల్ 2023 సీజన్లో నిన్న క్వాలిఫయర్ -1 మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చెన్నై సొంత గడ్డలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ధోనీ సేన గుజరాత్ ఊహకు అందని విధంగా ఆడింది. బ్యాటింగ్ కంటే.. బౌలింగ్, ఫీల్డింగ్ లో చెన్నై సత్తా చూపించింది. తొలుత టాస్ గెలిచిన గుజరాత్.. పక్కా ప్లాన్ తో బౌలింగ్ ను ఎంచుకుంది. దాంతో తొలి బ్యాటింగ్ కు దిగింది ధోనీ సేన. చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టు 200 పరుగులైనా చేస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. స్లో బౌన్సర్లు, చేంజ్ ఆఫ్ పేస్, యార్కర్లతో తికమకపెట్టింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 172 పరుగులు చేసింది. దాంతో చెన్నై ఫైనల్స్ కు వెళ్లదేమోనని భావించారు.
చెన్నై జట్టును ఓపెనర్లు ఆదుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే 87 పరుగులు చేశారు. గైక్వాడ్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 60 పరుగులు చేయగా.. కాన్వే 34 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు చేశారు. తొలి వికెట్ పడేసరికి వీరిద్దరి భాగస్వామ్యం 87 పరుగులు. శివమ్ దూబే ఒక బంతికి వెనుదిరగగా.. రహానే 17, రాయుడు 17, జడేజా 22 పరుగులు చేశారు. ఇక బౌలింగ్ లో ధోనీ సేన అద్భుత ప్రదర్శన కనబరిచింది. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీయడంతో పాటు.. గుజరాత్ కు అధిక పరుగులు ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు.
సీఎస్కే బౌలర్లు దీపక్ చహర్ 2, మహీశ్ తీక్షణ 2, రవీంద్ర జడేజా 2, మతీష పతిరణ 2, తుషార్ దేశ్ పాండే 1 వికెట్ తీశారు. గుజరాత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 42 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (4), తెవాటియా (3) ఔటయ్యారు. రషీద్ ఖాన్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేశాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ను ఆలౌట్ చేసిన తొలి జట్టుగా సూపర్ కింగ్స్ నిలిచింది. ఇన్నింగ్స్ ఆఖరిబంతికి పతిరణ విసిరిన బంతిని భారీ షాట్ కొట్టబోయిన షమీ.. క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో గుజరాత్ ఇన్నింగ్స్ కు తెరపడింది. చెన్నై జట్టు 10వ సారి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. ఈ నెల 28న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ విజేతతో తలపడనుంది. ఓడిన గుజరాత్ టైటాన్స్ కు మరో చాన్స్ ఉంది. ఆ జట్టు మే 26న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడనుంది.