INDvsENG: నేడే ఆఖరి టెస్ట్ మ్యాచ్.. భయపెడుతున్న వాతావరణం
ధర్మశాలలో జరగనున్న 5వ టెస్టు మ్యాచ్‌లో గెలవాలని భారత్, ఇంగ్లండ్ జట్లు
INDvsENG:ధర్మశాలలో జరగనున్న 5వ టెస్టు మ్యాచ్‌లో గెలవాలని భారత్, ఇంగ్లండ్ జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్లటి గాలితో స్టేడియం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) పాయింట్ల పట్టికలో మరింత మెరుగవ్వాలని భారత్ భావిస్తూ ఉంది. ఇంగ్లండ్ జట్టు ఆఖరి టెస్టులో అయినా భారత్ మీద గెలిచి పరువు నిలబెట్టుకోవాలని యోచిస్తూ ఉంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పిసిఎ) స్టేడియంలో గురువారం నుండి మార్చి 7 నుండి ప్రారంభం కానున్న ధర్మశాల టెస్ట్ లో పిచ్ తో పాటూ వాతావరణం ఎలా ఉంటుందో అనే భయం క్రికెట్ అభిమానులను వెంటాడుతూ ఉంది.
చల్లని ఉష్ణోగ్రతలు వర్షం కారణంగా గేమ్‌కు అనేకసార్లు అంతరాయం కలగవచ్చు. ఆఖరి టెస్ట్ మ్యాచ్ మొత్తం వర్షం ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా ధర్మశాల టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు వాష్ అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉందని భావిస్తూ ఉన్నారు. చివరి టెస్టు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు నుండి ధర్మశాలలో వాతావరణం ఆందోళనకరంగా ఉంది. అక్యూవెదర్ ప్రకారం టెస్టు మొదటి రెండు రోజులలో చల్లటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తర్వాత రెండు రోజులు చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా.. ఎక్కువగా ఎండ ఉంటుందని అంచనా వేస్తున్నారు. టెస్ట్ జరిగే ఐదు రోజులలో ధర్మశాలలో ఉష్ణోగ్రత 1వ రోజు 9 డిగ్రీల నుండి 5వ రోజు 20 డిగ్రీల వరకు ఉంటుందని అంచనా వేశారు.