క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ.. 29 బంతుల్లోనే బాదేశాడు..!

ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఐపీఎల్‌లో 30 బంతుల్లో సెంచరీ సాధించాడు.

Update: 2023-10-08 10:45 GMT

ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఐపీఎల్‌లో 30 బంతుల్లో సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్.. క్రిస్ గేల్, డివిలియర్స్ ఇద్దరి రికార్డులను బద్దలు కొట్టారు.

ఆస్ట్రేలియా దేశవాళీ వన్డే టోర్నీ మార్ష్ కప్‌లో టాస్మానియా, దక్షిణ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ప్రొఫెషనల్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. తొలి పవర్‌ప్లేలోనే సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన మెక్‌గర్క్ 38 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లోనే అతను ఔటయ్యాడు.

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తొలి రెండు ఓవర్లలో ఒక బంతిని మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే అవకాశం వచ్చిన వెంటనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో శామ్ రెయిన్‌బర్డ్‌పై జేక్ ఫ్రేజర్ 4 సిక్సర్లు, రెండు ఫోర్ల బాది 32 పరుగులు చేశాడు. అలాగే 7వ ఓవర్‌లో బ్రాడ్లీ హోప్, 9వ ఓవర్‌లో బిల్లీ స్టాన్‌లేక్‌పై ఓవ‌ర్ల‌లో మూడేసి సిక్సర్ల చొప్పున‌ బాదాడు. ఈ క్ర‌మంలో 18 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలో ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం. అంతకుముందు గ్లెన్ మాక్స్‌వెల్ 18 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత‌ 50 పరుగుల నుండి సెంచరీని చేరుకోవడానికి మెక్‌గుర్క్ కు కేవలం 11 బంతులు మాత్ర‌మే ప‌ట్టాయి.

ఈ మ్యాచ్‌లో టాస్మానియా తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్లకు 435 పరుగులు చేసింది. జోర్డాన్ సిల్క్ 85 బంతుల్లో 116 పరుగులు చేశాడు. ఓపెనర్ కాలేబ్ జ్యువెల్ 52 బంతుల్లో 90 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు. అయితే.. మెక్‌గుర్క్ టీమ్ సౌత్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం.




Tags:    

Similar News