రాజకీయాల్లోకి ఆచార్య తుమ్మల పాపిరెడ్డి
ఇలా రోజూ ఏదొక ఆసక్తికర ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా మరొకరి రాజకీయ ప్రవేశంపై చర్చ..
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. పార్టీల విలీనం, పొత్తులు, రాజకీయ నేతల చేరికలు, కొత్తపార్టీలు, ఉన్నపార్టీల పెద్దలతో చర్చలు, ఇలా రోజూ ఏదొక ఆసక్తికర ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా మరొకరి రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతోంది. ఆయనే ఆచార్య తుమ్మల పాపిరెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలి ఛైర్మన్‌గా పనిచేసిన ఆచార్య తుమ్మల పాపిరెడ్డి రాజకీయ ప్రవేశం చేయనున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
ఆదిలాబాద్ కు చెందిన పాపిరెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ఆచార్యుడిగా పనిచేసి వరంగల్ లో స్థిరపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో వరంగల్ జిల్లా తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్ గా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ 2014 ఆగస్టు 5న తుమ్మల పాపిరెడ్డిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గా నియమించారు. ఆ పదవిలో ఏడేళ్లకు పైగా పనిచేసిన ఆయన.. 2021 ఆగస్టులో వైదొలిగారు. జూన్ 25న ఖమ్మంలో జరగనున్న రాహుల్ గాంధీ బహిరంగ సభలో లేదా.. ఢిల్లీ వెళ్లి అధిష్టానం సమక్షంలో చేరుతానని ఆయన తెలిపారు.