Revanth Reddy : కేసీఆర్ కాళ్లకు కళ్లెం.. మిషన్ భగీరధపై కూడా విచారణకు సిద్ధం?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా విచారణలకు ప్రభుత్వం ఆదేశిస్తుంది
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా విచారణలకు ప్రభుత్వం ఆదేశిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో అనేక పథకాలను, ప్రాజెక్టులను చేపట్టింది. ఈ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అమలు చేసిన పథకాల్లో, ప్రాజెక్టుల్లో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లోనూ ప్రధాన అస్త్రంగా మలిచారు. అలాంటిది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులపై విచారణను చేపడుతున్నారు. మేడిగడ్డ వద్ద పగుళ్లు రావడంతో ఎటూ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రాగానే విచారణ చేయించడానికి సిద్ధమయింది.
కోట్ల రూపాయల అవినీతి...
మరోవైపు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావించిన మిషన్ భగీరధ పథకంపై కూడా విజిలెన్స్ విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేసీఆర్ ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షితమైన నీటిని అందించిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పి 2018 ఎన్నికల నాటికి దానిని పూర్తి చేయగలిగారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో రూపొందించిన మిషన్ భగీరధ పథకానికి కేసీఆర్ ప్రభుత్వం నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో ఈ పధకాన్ని మెచ్చుకుంది. ప్రజలకు రక్షిత నీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేశామని అప్పట్లో కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు.
అవకతవకలు జరిగినట్లు...
అయితే ఈ మిషన్ భగీరధలో అవకతవకలు, అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దాదపాు ఏడు వేల కోట్ల రూపాయల విలువైన పనుల్లో ఈ అవకతవకలు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తుంది. చేసిన పనులనే చేసినట్లు చూపించి బిల్లులు చేసుకున్నారని భావించి ఈ అవకతవకలపై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కూడా చర్చించినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి గత ప్రభుత్వం అవినీతిని ప్రజల ముందు పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే ఉంచాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. మరి కేసీఆర్ ను నిలువరించాలంటే విచారణలు తప్పనిసరి అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
మరి విచారణలో నిజమెంత అన్నది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.