Telangana : వారం రోజులు జాగ్రత్త సుమా.. చలి చంపేస్తుందంట

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హై అలెర్ట్ ప్రకటించింది. మరో వారం రోజులు పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2024-11-21 07:14 GMT

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హై అలెర్ట్ ప్రకటించింది. మరో వారం రోజులు పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయని తెలిపింది. తెలంగాణలో పదిహేను డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయాని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరడంతో అనేక వ్యాధులు ప్రబలే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వీలయినంత వరకూ ఇంట్లోనే ఉండటం శ్రేయస్కరమని, బయటకు వచ్చినప్పుడు చలి నుంచి కాపాడుకోవాడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

జాగ్రత్తగా ఉండాల్సిందే...
ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగులు ఈ చలి నుంచి బయటపడటానికి జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న వారం రోజుల పాటు జాగ్రత్తగా లేకపోతే అనేక రకాలైన వ్యాధులు ప్రబలుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పలు రకాల హెచ్చరికలతో పాటు సూచనలు జారీ చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇన్ ఫ్లూయెంజా అనే వ్యాధి ప్రబలే అవకాశముందని వైద్య నిపుణులు తెలిపారు. తీవ్రమైన చలితో జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.
ఇన్ ఫ్లూయెంజా వ్యాధితో...
ఈ ఇన్ ఫ్లూయెంజా దాదాపు సాధారణమైన వ్యాధి అని, దీనికి భయపడాల్సిన పనిలేదని కూడా వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ లక్షణాలు తగ్గడానికి వారం రోజుల సమయం పడుతుందని కూడా చెబుతున్నారు. ప్రధానంగా శ్వాస సంబంధిత వ్యాధులున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ కు లోను కాకుండా ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవాలని, పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా కొంత వరకూ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిదని సూచించారు. ఈ వ్యాధి ప్రమాదకరం కాదని కూడా వైద్య నిపుణులు చెప్పారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలని తెలిపారు.





Tags:    

Similar News