Kalvakuntla Kavitha : కవిత బెయిల్ పై టెన్షన్... నేడు సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2024-08-27 02:32 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఐదు నెలల నుంచి కవిత తీహార్ జైలులోనే ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కవితకు అనేక మార్లు ట్రయల్ కోర్టు బెయిల్ ను నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై సీబీఐ, ఈడీలు ఛార్జిషీట్లు వేశాయి. దీంతో పాటు లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఉందని బలంగా రెండు సంస్థలు చెబుతున్నాయి. దీంతో పాటు అందుకు తగినట్లుగా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్లు విడివిడిగా కవితను విచారణ కూడా జరిపారు. ఈ కేసులో వందల కోట్లు చేతులు మారినట్లు ఆరోపిస్తున్నారు.

సాక్షులను ప్రభావితం చేస్తారని...
ప్రధానంగా సౌత్ లాబీని ఒక చోట చేర్చి వారందరి నుంచి డబ్బులు వసూలు చేసిన కల్వకుంట్ల కవిత వాటిని ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళంగా ఇచ్చారని సీబీఐ, ఈడీ వాదిస్తుంది. ఆమె ఏ హోటల్స్ లో వారిని కలిసిందీ? వారి నుంచి డబ్బులు వసూలు చేసి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి వచ్చి ఎవరెవరికి డబ్బులు చేరవేసింది? తమ విచారణలో తేలిందని చెబుతున్నాయి. అందుకే కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ట్రయల్ కోర్టు రెండు సంస్థల తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. అందుకే ఇన్నాళ్లు ఆమెకు బెయిల్ రాలేదన్నది న్యాయనిపుణుల అంచనాగా వినిపిస్తుంది. దీంతో కవిత తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బెయిల్ వస్తుందని...
మరోవైపు కవిత తరుపున న్యాయవాదులు కూడా బలంగా వాదిస్తున్నారు. కవిత సాక్షులను ప్రభావితం చేయరని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవంటూనే ఆమె అనారోగ్యంతో తీహార్ జైలులో ఇబ్బంది పడుతున్నారని బలమైన వాదనను ధర్మాసనం ముందు ఉంచుతున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు బెయల్ మంజూరు చేసింది. దీంతో కల్వకుంట్ల కవితకు కూడా బెయల్ వస్తుందని నమ్ముతున్నారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన కవిత అరెస్టయ్యారు. ఆమెకు ఈసారి ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్న ఆశాభావంతో బీఆర్ఎస్ నేతలున్నారు. అందుకే ఎక్కువ సంఖ్యలో నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.


Tags:    

Similar News