రాహుల్‌తో మీడియా అధినేతల భేటీ.! హడావిడిగా రేవంత్
తెలుగు మీడియా అధినేతలతో రాహుల్ గాంధీ భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. వ్యతిరేక ముఠా అంటూ ఇప్పటికే టీఆర్ఎస్ ట్రోల్ చేస్తోంది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు విచ్చేసిన రాహుల్ రాత్రి హైదరాబాద్‌లోనే బస చేశారు. అనూహ్యంగా ఆయన తెలుగు మీడియా అధినేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌తో ఆయన భేటీ అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దగ్గరుండి ఈ భేటీని పర్యవేక్షించారు. మీడియా అధినేతల వెంట రేవంత్ హడావిడిగా కనిపించారు.
హోటల్ వద్ద మీడియా అధినేతల వీడియోలతో అధికార టీఆర్ఎస్ పార్టీ ట్రోల్ చేస్తోంది. తెలంగాణ వ్యతిరేక ముఠా అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, టీఎస్ఎండీసీ చైర్మన్ మీడియా అధినేత భేటీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''తెలంగాణ వ్యతిరేక ముఠా మళ్ళీ ఒకటైంది .. రవి ప్రకాష్, రాధాకృష్ణ ను రాహుల్ గాంధీకి దగ్గరుండి కలిపించిన రేవంత్'' అంటూ ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు. తెరవెనక ఏదో జరుగుతోందన్న అనుమానాలు రేకెత్తించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా చానల్, పత్రిక ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ హయాంలో 2009లో సాక్షి ప్రారంభమైంది. తదనంతర పరిణామాలతో వైఎస్ జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి మీడియా సపోర్ట్ లేకుండా పోయింది. అప్పటి నుంచి సొంతంగా ఓ చానల్ ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో మీడియా అధినేతలు భేటీ కావడం.. రేవంత్ దగ్గరుండి వారిని కల్పించడం ఆసక్తి రేపుతోంది.